Heart Attack: పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరిట కొత్త స్కీమ్‌.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

గుండెపోటు కేసులు పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యే వారికి గోల్డెన్‌ అవర్‌లోనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు సినీనటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించింది.

Updated : 31 Oct 2023 22:31 IST

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు (Heart attack) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సినీ నటుడు, దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారికి ‘గోల్డెన్‌ అవర్‌’లోనే చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడటమే లక్ష్యంగా ‘డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హృదయ జ్యోతి యోజన’ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటించారు. 2021 అక్టోబర్‌ 29న పునీత్‌ రాజ్‌కుమార్‌ (46) గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి వెల్లడించారు. ‘‘ఇటీవల యువకులు గుండెపోటుకు గురవుతున్న ఘటనల్ని చూస్తున్నాం. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఓ అధ్యయనం ప్రకారం గుండెపోటుకు గురైన వారిలో 35 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెపోటుకు గురయ్యేవారికి గోల్డెన్ అవర్‌లోనే చికిత్స అందించడం చాలా ముఖ్యం. సామాన్య ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రెండు పద్ధతుల్లో అమలు చేస్తాం. హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో చికిత్స అందించడం ఒకటి కాగా.. బహిరంగ ప్రదేశాల్లో ఏఈడీ పరికరాలు అమర్చడం రెండోది’’ అని చెప్పారు. 

‘‘ఛాతి నొప్పితో బాధపడుతున్న ఎవరైనా ఈ ‘స్పోక్‌’ సెంటర్లను సందర్శించి వెంటనే ఈసీజీ తీయించుకోవచ్చు. AI సాంకేతికత ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందో, లేదో నాలుగైదు నిమిషాల్లోనే గుర్తించవచ్చు. ట్రైకాగ్ (Tricog) AI సాంకేతికత సహాయంతో క్లిష్టమైన లేదా నాన్-క్రిటికల్ సమస్యలను గుర్తించేందుకు ఒక వ్యవస్థ రూపొందించాం. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న వారికి తాలూకా స్థాయి ఆసుపత్రుల్లోని ‘స్పోక్’ సెంటర్లలో ఖరీదైన ఇంజెక్షన్‌ను ఉచితంగా అందజేస్తాం. ఈ ఇంజెక్షన్‌ అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు నుంచి కాపాడటంలో చాలా సమర్థంగా పనిచేస్తుంది.  ప్రైవేటు ఆస్పత్రుల్లో దీని ధర రూ.30వేలు నుంచి 45వేల వరకు ఉంటుంది. దీన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తాలుకా, జిల్లా ఆస్పత్రుల్లోని ‘స్పోక్‌’ సెంటర్లలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య సాయం కోసం  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి అంబులెన్సుల్లో పంపిస్తాం. బీపీఎల్‌ కార్డుదారులు ఉచితంగా చికిత్స పొందొచ్చు. ఏపీఎల్‌ కార్డు కలిగినవారైతే ఆరోగ్య కర్ణాటక ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డు కింద ఉచిత వైద్యం పొందొచ్చు’ అని మంత్రి దినేశ్ గుండూరావు చెప్పారు. 

‘‘బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాలు, విధాన సౌధ, కోర్టులు తదితర ప్రాంతాల్లో AED పరికరాలను ఏర్పాటు చేస్తాం. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో AED పరికరాలను అందుబాటులో ఉంచుతాం. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో 50 పరికరాలను అమర్చేందుకు ప్రణాళిక రూపొందించాం. ఒక్కో ఏఈడీ డివైజ్‌ ధర రూ.1.10లక్షలు ఉంటుంది. వీటి సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది’’ అని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని