నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్‌ భాగవత్‌

RSS chief on unemployment: పని, వృత్తి పట్ల గౌరవం లేకపోవడమే నిరుద్యోగ సమస్యకు మూల కారణమని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఉద్యోగాల కోసం పరితపించొద్దంటూ యువతకు సూచించారు.

Updated : 06 Feb 2023 19:07 IST

ముంబయి: దేశంలో నిరుద్యోగ సమస్యపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రకాల వృత్తులను గౌరవించలేకపోవడమే నిరుద్యోగానికి (Unemployment) కారణమని చెప్పారు. అన్ని రకాల వృత్తులను, పనులను గౌరవించాలన్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దని యువతకు సూచించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పని ఎలాంటిదైనా దాన్ని ముందు గౌరవించాలి. పనిని గౌరవించ లేకపోవడమే సమాజంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణం. మేధస్సుతో చేసేదైనా, శారీరక శ్రమతో చేసే కష్టమైనా దాన్ని ముందు గౌరవించాలి. చాలా మంది ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ రంగం కేవలం 10 శాతం మాత్రమే ఉద్యోగాలు కల్పించగలదు. ఇతర ఉద్యోగాలు మరో 20 శాతం ఉంటాయి. ప్రపంచంలో ఏ సమాజమూ 30 శాతానికి మించి ఉద్యోగాలను కల్పించలేదు’’ అని భాగవత్‌ వ్యాఖ్యానించారు.

పొట్ట కూటి కోసం కష్టపడి పనిచేసే పనిచేసేవారికి సమాజం పట్ల బాధ్యత ఉంటుందని భాగవత్‌ అన్నారు. సమాజం కోసం పనిచేసేటప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా ఉండదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థ పై మాట్లాడారు. దేవుడు ముందు అందరూ సమానమేనని, ఆయన ముందు కులం, వర్గం అన్న భేదం ఉండబోదని చెప్పారు. కొందరు పండితులు శాస్త్రాలు వాటికి ఆధారంగా చెప్పటం కూడా అబద్ధమేనన్నారు. అది పూర్తిగా తప్పని వ్యాఖ్యానించారు. దేశం విశ్వ గురువు కావడానికి సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. అందుకు కావాల్సిన నైపుణ్యాలకు దేశంలో కొదవలేదని భాగవత్‌ అన్నారు.

మరి 2 కోట్ల ఉద్యోగాల మాటేంటి: సిబల్‌

ఉద్యోగాల కోసం పరుగులు తీయొద్దంటూ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యా్ఖ్యలపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ స్పందించారు. మరి ప్రధాని మోదీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల మాటేంటని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరితపించొద్దని సూచించారు సరే..  మరి ప్రైవేటు ఉద్యోగాలైనా ఏవి భాగవత్‌ జీ’’ అంటూ ప్రశ్నించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని