Rahul Gandhi: సూరత్‌ కోర్టులో రాహుల్‌ లాయర్‌ ఎవరు..?

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు కేసు దేశంలో ప్రకంపనలు రేపుతోంది. హేమాహేమీ లాయర్లు ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ తరపున సూరత్‌ కోర్టులో వాదించిన న్యాయవాది ఎవరూ అనే చర్చజరుగుతోంది. 

Updated : 26 Mar 2023 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మోదీ(Modi) అనే ఇంటిపేరు’పై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా నమోదైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసును నాలుగేళ్లుగా రాహుల్‌ తరపున వాదించిన లాయర్‌ ఎవరు? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

సూరత్‌ కోర్టులో రాహుల్‌ తరపున వాదించిన లాయర్‌ పేరు కిరిట్‌ పాన్‌వాలా.  ఆ నగరంలో పేరుమోసిన క్రిమినల్‌ లాయర్లలో ఆయన కూడా ఒకరు. ఆయన వాదించిన కేసుల్లో విజయం సాధించినవే ఎక్కువ. 1953లో జన్మించిన పాన్‌వాలా 1976లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి.. 1978 నాటికి న్యాయవిద్యలో మాస్టర్స్‌ చేశారు. దాదాపు 45 సంవత్సరాలకు పైగా ఆయన న్యాయవాద వృత్తిలో ఉండి 1600 కేసులను వాదించారు. 

అంతేకాదు.. పాన్‌వాలా సూరత్‌లోని నవయుగ్‌ కామర్స్‌ కళాశాల, నవయుగ్‌ న్యాయవిద్య కళాశాల, వి.టి. చౌక్సీ లా కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన సత్యమహితి అనే పుస్తకం కూడా రాశారు. అంతేకాదు ‘నర్మదా తారా వాహీ జాతా పానీ’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి చాలా అవార్డులు వచ్చాయి. 

2019 మార్చి 5వ తేదీన రాహుల్‌ పై భాజపా నేత పూర్ణేష్‌ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. నాటి నుంచి ఆ కేసులో తీర్పు వచ్చేవరకు కిరీట్‌ పాన్‌వాలానే రాహుల్‌ తరపున వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి రాహుల్‌ మూడు సార్లు కోర్టుకు హాజరయ్యారు. 2021 అక్టోబర్‌లో చివరి సారిగా తాను నిర్దోషినని వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ప్రతివాదులు రాహుల్‌ వివాదాస్పద ప్రసంగం కాపీని సీడీ, పెన్‌ డ్రైవ్‌ రూపంలో న్యాయస్థానానికి సమర్పించి రాహుల్‌ ‘మోదీ అనే ఇంటిపేరునుకించపర్చినట్లు’ ఆరోపించారు. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చి న్యాయస్థానం శిక్షను విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని