మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. బాలీవుడ్‌, క్రికెట్‌ దిగ్గజాల కౌంటర్‌

Published : 07 Jan 2024 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాల్దీవుల మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్‌ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోదీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖలపై భారత సెలబ్రిటీలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. అక్కడి అందాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా మాల్దీవుల మంత్రికి బదులిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహాం, శ్రద్ధా కపూర్‌ వంటి తారలు స్వదేశీ టూరిజానికి మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.

బాలీవుడ్‌ గళం..

‘మాల్దీవుల మంత్రి చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలు చూశాను. భారీ స్థాయిలో పర్యాటకులను పంపించే దేశం (భారత్‌)పై అలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం. కానీ, ద్వేషాన్ని మేమెందుకు సహించాలి? ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ప్రశంసించా. ఆత్మగౌరవమే ఫస్ట్‌. భారత దీవుల్లో ప్రయాణిస్తూ (#ExploreIndianIslands).. మన పర్యాటకానికి మద్దతు తెలుపుదాం’ అని అక్షయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

‘లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచ్‌లలో ప్రధానమంత్రి మోదీని చూడటం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలోనే ఉండటం’ అని నటుడు సల్మాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు. ‘అతిథి దేవోభవ’ అనే సందేశంతో ఇచ్చే అద్భుతమైన భారతీయ ఆతిథ్యం, విస్తారమైన సముద్ర తీరం చూడాల్సిందే. ఇందుకోసం లక్షద్వీప్‌నకు వెళ్లాల్సిందే’ అని మరో నటుడు జాన్‌ అబ్రహాం పేర్కొంటూ అక్కడి బీచ్‌ ఫొటోలను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. లక్షద్వీప్‌ బీచ్‌ల అందాలపై బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కూడా గళాన్ని విప్పారు. సుందరమైన బీచ్‌లకు నెలవైన అందాలను చూసేందుకు ఈ ఏడాది ప్లాన్‌ చేసుకుంటున్నానని అన్నారు.

అదే బాటలో తెందూల్కర్‌..

లక్షద్వీప్‌ అందాలపై దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కూడా స్పందించారు. ‘సింధూదుర్గ్‌లో ఇటీవల పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నా. మాకు కావాల్సినవన్నీ లభించాయి. అందమైన ప్రదేశాలు, అద్భుతమైన ఆతిథ్యం ఎన్నో జ్ఞాపకాలను అందించాయి. ఎన్నో అందమైన, సహజ దీవులకు భారత్‌ నెలవు. చూడాల్సిన ప్రదేశాలు, ఎన్నో జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి వేచి చూస్తోంది’ అంటూ తెందూల్కర్‌ ట్వీట్‌ చేశారు. అక్కడ క్రికెట్‌ ఆడిన వీడియో, బీచ్‌ ఫొటో షేర్‌ చేశారు.

మాల్దీవుల పర్యటనలు రద్దు..

వీరితోపాటు మరికొంత మంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా అక్కడ త్వరలో పర్యటించాలనుకుంటున్న వాళ్లు కూడా తమ ప్రయత్నాలను విరమించుకుంటామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమ ట్రిప్‌ను రద్దు చేసుకుంటున్నామని పేర్కొంటూ ట్వీట్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని