మెలానియా అభిప్రాయం కూడా అదేనట!

నేనొదల అంటున్న ట్రంప్‌.. తన అర్థాంగి సలహానైనా పాటిస్తారో లేదో వేచి చూడాల్సిందే!

Updated : 09 Dec 2022 13:19 IST

వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని అంగీకరించి హుందాగా వ్యవహరించాలని కోరుతున్న సన్నిహితుల జాబితాలోకి ఆయన భార్య మెలానియా ట్రంప్‌ కూడా చేరారు. తాజా ఎన్నికల ఫలితాలపై అమెరికా ప్రథమ మహిళ బహిరంగంగా ఏ వ్యాఖ్య చేయనప్పటికీ.. ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా వెల్లడి చేసినట్టు సమాచారం. కరోనా వైరస్‌ సోకటంతో భర్త తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలోకి ఆమె ఆలస్యంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఫలితాలు వెలువడిన అనంతరం ఓడిన వారు దానిని అంగీకరిస్తూ ‘ఓటమి అంగీకార ప్రసంగం’ చేయటం అగ్రరాజ్య సంప్రదాయం. కాగా.. ట్రంప్‌ అసలు ఆ ఊసే ఎత్తడంలేదు. దీనితో ఆయన వైఖరి అహంకార పూరితమా లేదా వేరే ఏదైనా వ్యూహమా అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక తాజా ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ల ఓటమి, జో బైడెన్‌ గెలుపుపై న్యాయస్థానంలో పోరాడాలనే అభిప్రాయానికి ట్రంప్‌ మద్దతుదార్లు సై అంటున్నారు. ఐతే గౌరవప్రదంగా నిష్క్రమిస్తేనే సమంజసంగా ఉంటుందని భావిస్తున్న వారిలో ట్రంప్‌ అల్లుడు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు జరేడ్‌ కుష్నర్‌ తదితర ప్రముఖులు ఉండటం గమనార్హం. ఏదేమైనా ఈ వ్యవహారం కోర్టులో తేలేవరకూ నేనొదలను అంటున్న ట్రంప్‌.. తన అర్ధాంగి సలహానైనా పాటిస్తారో లేదో వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని