Moderna: జులై 15నుంచి మోడెర్నా టీకాల పంపిణీ! 

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్‌లో మరో టీకా పంపిణీకి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు లభించిన

Published : 05 Jul 2021 16:13 IST

దిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్‌లో మరో టీకా పంపిణీకి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు లభించిన విషయం తెలిసిందే. మోడెర్నా టీకా డోసులు ఈ వారంలోనే భారత్‌కు చేరనున్నాయి. జులై 15 నుంచి పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

మోడెర్నా టీకా దిగుమతుల కోసం ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) గతవారం అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. టీకా పంపిణీ చేపట్టిన తర్వాత తొలి 100 లబ్ధిదారులకు సంబంధించి 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో సిప్లా దిగుమతి ప్రక్రియ ప్రారంభించింది. 

ఈ వారం చివరినాటికి మోడెర్నా డోసులను దిగుమతి చేసుకోనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించేందుకు మరో వారం పట్టనుందని తెలుస్తోంది. జులై 15 నుంచి ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా పంపిణీ మొదలవనున్నట్లు సమాచారం. మోడెర్నా టీకాను mRNA టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ప్రయోగాల్లో 90శాతానికి పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.  

ధర ఎంతో..

భారత్‌లో ఈ టీకా ధరను అటు మోడెర్నా గానీ, ఇటు సిప్లా గానీ ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర టీకాల కంటే ఎక్కువే ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టీకా ధరను సిప్లా ప్రకటించే అవకాశముంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని