NIA Raids: భారత దౌత్య కార్యాలయంపై దాడుల కేసు.. పంజాబ్, హరియాణాల్లో ఎన్‌ఐఏ సోదాలు

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై జరిగిన దాడుల కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం పంజాబ్‌, హరియాణాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.  

Published : 22 Nov 2023 18:47 IST

దిల్లీ: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత దౌత్య కార్యాలయంపై దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పంజాబ్‌, హరియాణాల్లోని 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 19, జులై 2న విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణలో భాగంగా పంజాబ్‌లోని మోగా, జలంధర్‌, లూథియానా, గురుదాస్‌పుర్‌, మొహాలి, పాటియాలాతోపాటు హరియాణాలోని కురుక్షేత్ర, యమునానగర్‌లో సోదాలు చేపట్టినట్లు తెలిపింది. 

ఈ సోదాల్లో.. భారత దౌత్య కార్యాలయంపై దాడి వెనకున్న నిందితుల వివరాలతోపాటు, ముఖ్యమైన డిజిటల్‌ డేటా, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. దాడి వెనకున్న నిందితులను గుర్తించి, విచారించడంతోపాటు, విదేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి గట్టి హెచ్చరికలు పంపాలనే ఉద్దేశంతో ఎన్‌ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్‌ఐఏ బృందం ఈ ఏడాది ఆగస్టులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భాతర దౌత్య కార్యాలయానికి వెళ్లింది. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తుల, సంస్థల వివరాలకు సంబంధించి కీలక సమాచారం సేకరించింది. 

ఈ ఏడాది మార్చి, జులై నెలల్లో భారత్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో,  బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని భారత దౌత్య కార్యాలయాలపై ఖలీస్థానీ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై అప్పట్లో దిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ చేపట్టింది. ఇందులో భాగంగా గత ఆరు నెలలుగా పంజాబ్‌, హరియాణాల్లో పలు చోట్ల వరుస దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే కెనడాలో ఉంటున్న నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SGF) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఆస్తులను ఎన్‌ఐఏ సెప్టెంబరులో జప్తు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని