INDIA bloc: ఇండియా కూటమి కన్వీనర్‌గా నీతీశ్ కుమార్‌..?

కొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో విపక్ష పార్టీల కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar)ను కన్వీనర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. 

Updated : 03 Jan 2024 14:09 IST

దిల్లీ: విపక్షాల ‘ఇండియా’ కూటమి(INDIA bloc)లో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) కీలకపాత్ర పోషించనున్నట్లు కనిపిస్తోంది. ఆయన కూటమి కన్వీనర్‌గా నియమితులు కానున్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లో విపక్ష పార్టీలన్నీ వర్చువల్‌గా సమావేశమై ఈ నిర్ణయాన్ని ఆమోదించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ నియామకంపై మంగళవారం కాంగ్రెస్‌(Congress) పార్టీ.. జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar), ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad)తో చర్చించిందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత నియామకంపై కూటమిలో మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిగాయి. కీలక పార్టీ అయిన ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ కూడా తన మద్దతు ప్రకటించారని ఆ వర్గాలు వెల్లడించాయి.

‘మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు..’

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించే లక్ష్యంతో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. గత నెల ఈ కూటమి నాలుగో సమావేశం జరిగింది. ఆ భేటీలో విపక్ష కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్‌ నేతలు ప్రతిపాదించారు. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ‘తొలుత సమష్టిగా పోరాడదాం.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాం’ అని చెప్పినట్లు సమాచారం.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని