Nitish Kumar: కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న.. ఇన్నేళ్లకు మా కల నెరవేరింది: నీతీశ్‌

దివంగత నేత కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ప్రకటించడం పట్ల బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

Updated : 24 Jan 2024 01:30 IST

పట్నా: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌ (Karpoori Thakur)కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడం పట్ల బిహార్‌ (Bihar) సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కర్పూరి ఠాకూర్‌ శతజయంతి వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దళితులు, వెనకబడిన కులాలకు ఈ నిర్ణయం ఓ మంచి సందేశం తీసుకెళుతుందని నీతీశ్‌ అన్నారు.  

‘‘చాలా కాలం నుంచే కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ నిర్ణయం ప్రకటించడం సంతోషకరం. ఇన్నేళ్లకు జేడీయూ కల సాకారమైంది. ఈ నిర్ణయం ప్రకటించిన ప్రధానికి ధన్యవాదాలు’’ అని నీతీశ్‌ అన్నారు. కర్పూరి ఠాకూర్‌ను రాజకీయ గురువుగా ఆరాధించే నీతీశ్‌ కుమార్‌.. దివంగత సీఎం పుట్టి పెరిగిన గ్రామాన్ని ‘కర్పూరి గ్రామ్‌’గా మార్చారు. ఏటా ఆయన జయంతి వేళ నీతీశ్‌ ఆ గ్రామాన్ని సందర్శిస్తారు. జేడీయూ అనేక సార్లు కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేసిందని ఆ పార్టీ కీలక నేత, మంత్రి సంజయ్‌ కుమార్‌ ఝా గుర్తుచేశారు. ఈ మేరకు 2007, 2017, 2018, 2019, 2021లో నీతీశ్‌ కుమార్‌ కేంద్రానికి చాలా సార్లు లేఖలు రాశారన్నారు. మరోవైపు ఠాకూర్‌ శతజయంతిని పురస్కరించుకొని బుధవారం భారీ ర్యాలీ చేపట్టేందుకు జేడీయూ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు