Missile Fire: పాక్‌ భూభాగంలోకి భారత క్షిపణి.. అమెరికా ఏమందంటే..

భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి ఇటీవల పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇది పొరబాటుగా జరిగిన ఘటనే తప్ప.. మరేదీ కాదని

Updated : 15 Mar 2022 15:22 IST

వాషింగ్టన్‌: భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి ఇటీవల పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇది పొరబాటుగా జరిగిన ఘటనే తప్ప.. మరేదీ కాదని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్‌ విలేకరులతో అన్నారు. ‘‘భారత్‌ చెప్పినట్లుగా ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప మరో కోణమేదీ ఉన్నట్లు కన్పించట్లేదు . దీనిపై ఇప్పటికే మార్చి 9న భారత్‌ విలువైన వివరణ ఇచ్చింది. దీనిపై మేం ఇంతకంటే ఎక్కువగా స్పందించలేం’’ అని నెడ్‌ ప్రైస్‌ సమాధానమిచ్చారు.

మార్చి 9న భారత వాయుసేన స్థావరంలో ఓ క్షిపణికి సాధారణ తనిఖీలు చేస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి అది గాల్లోకి లేచింది. ప్రమాదవశాత్తూ దూసుకెళ్లి పాకిస్థాన్‌ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత రక్షణశాఖ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నామని, అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొంది. 

అయితే పాక్‌ గగనతలంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపిస్తూ పొరుగుదేశం అక్కడి భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి, ఫలితాన్ని తెలియజేయాలని భారత రాయబారికి స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని