Omicron XE: మరింత వేగంతో ‘ఎక్స్‌ఈ’.. మాస్కులు తీయొద్దు!

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాలైన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ ఉత్పరివర్తనాలైన XE (ఎక్స్‌ఈ) వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నట్లు తెలుస్తోంది.......

Published : 04 Apr 2022 01:25 IST

కరోనా ఇంకా సమసిపోలేదని నిపుణుల హెచ్చరిక

దిల్లీ: భారత్‌తోపాటు ప్రపంచ దేశాలను రెండేళ్లకాలంగా గడగడలాడిస్తోంది కరోనా వైరస్‌. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరింయంట్‌ తీవ్రంగా వ్యాప్తిచెంది అనేకమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇదిలా ఉంటే మరింత వేగంగా వ్యాప్తిచెందే మరో మ్యుటేషన్‌ ఇప్పుడు గుబులు రేపుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాలైన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ ఉత్పరివర్తనాలైన XE (ఎక్స్‌ఈ) వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే BA.2 కంటే.. ఇది 10శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధరణ అయ్యింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా భారత్‌లోని నిపుణులు దీనిపై స్పందిస్తూ.. మాస్కులపై అశ్రద్ధ వహించకూడదని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదని పునరుద్ఘాటిస్తున్నారు.

కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో మాస్కులు తీయొద్దని దిల్లీ మెడికల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు అరుణ్‌ గుప్తా ఓ జాతీయ మీడియా సంస్థతో పేర్కొన్నారు. వైరస్‌పై అశ్రద్ధ తగదన్నారు. ‘కరోనా ఇంకా వ్యాపిస్తూనే ఉంది. బ్రిటన్‌, అమెరికా, చైనా, హాంకాంగ్‌ దేశాల్లో వైరస్‌ ఇంకా విజృంభిస్తూనే ఉంది. భారత్‌లో మళ్లీ విజృంభించదా? అనే ప్రశ్నకు గ్యారెంటీ ఇవ్వలేం. అందుకే కనీసం ఏడాది పాటు కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంతవరకు కొవిడ్‌ నియమనిబంధనలను ప్రభుత్వాలు ఎత్తివేయకూడదు’ అని వెల్లడించారు.

టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టీఐజీఎస్) డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. ‘కొత్త ఉత్పరివర్తనం ఎక్స్‌ఈ జనవరి మధ్యలో మొదటిసారి ఉద్భవించింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 600 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ మనం దానిని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఇది ఏ స్థాయిలో వ్యాపిస్తుందో చెప్పేందుకు కచ్చితమైన ప్రమాణికాలు లేవని, దీనిపై మరింత సమాచారం అవసరం అన్నారు. కానీ అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే రానున్న విపత్తుల నుంచి భద్రంగా ఉంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని