PM Modi: జో బైడెన్‌తో మోదీ భేటీ.. అమెరికాతో పలు కీలక ఒప్పందాలు!

దిల్లీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక భేటీ జరిగింది.

Updated : 08 Sep 2023 23:42 IST

దిల్లీ: భారత్‌ సారథ్యంలో జరిగే జీ20(G20 Summit) శిఖరాగ్ర సమావేశానికి దిల్లీకి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) భారత ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. హైటెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇందనం, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే, ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిపైనా చర్చించినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ 7లోకి బైడెన్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బైడెన్‌తో సమావేశం చాలా ఫలప్రదంగా సాగినట్టు పేర్కొన్నారు. తామిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయని.. ఇరు దేశాల ఆర్థిక, ప్రజా సంబంధాలపై చర్చలు జరిపినట్టు మోదీ తెలిపారు.

భారత్- అమెరికా మధ్య ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచే అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేయడంలో కీలక పాత్ర పోషించే దిశగా కృషి జరుగుతుందని మోదీ అభిలషించారు. చంద్రయాన్‌-3 చరిత్రాత్మక విజయం, ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై ప్రధాని మోదీని, ఇస్రో శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభినందించారు. షికాగో క్వాంటం ఎక్స్‌ఛేంజ్‌లో ఐఐటీ బాంబే భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా బైడెన్‌ ప్రశసించారు. ఇరువురు నేతల భేటీ సందర్భంగా అమెరికా, భారత్‌ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.

  • అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య  బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆవిష్కరణల్లో సహకారానికి ఒప్పందం.
  •  శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో ఇరుదేశాలు కలిసి పనిచేయడం 
  • సెమీకండక్టర్ల పరిశోధన, భవిష్యత్‌ తరం కమ్యూనికేషన్‌ వ్యవస్థపై సహకారం
  • సైబర్‌ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారం
  • భద్రత, టెలీకమ్యూనికేషన్స్‌ రంగాల్లో పరస్పర సహకారం 
  • భారత్‌ 6జీ అలయన్స్‌, నెక్స్ట్‌ జీ అలయన్స్‌ మధ్య అవగాహన 
  • సెమీకండక్టర్ల గొలుసు సరఫరా, మైక్రోచిప్‌ టెక్నాలజీ సహకారం 
  • ఆయా రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి 300 మిలియన్‌ డాలర్ల పెట్టబడులకు అంగీకారం
  • ఐదేళ్లలో భారత్‌లో అధునాతన మైక్రో డివైజ్‌లో 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు అంగీకారం
  • భద్రత, టెలీకమ్యూనికేషన్స్‌ రంగాల్లో పరస్పర సహకారం 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని