PM Modi: సూడాన్‌లో 4వేల మంది భారతీయులు.. ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష..!

సూడాన్‌లో (Sudan) సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (RSF)కు మధ్య జరుగుతోన్న పోరాటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు.

Updated : 21 Apr 2023 17:08 IST

దిల్లీ: సూడాన్‌లో (Sudan) సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (RSF)కు మధ్య జరుగుతోన్న సాయుధ పోరాటంలో వందలమంది పౌరులు, సైనికులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. చర్చలకు ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ అవి కొలిక్కి రావడం లేదు. దీంతో అక్కడున్న సుమారు 4వేల మంది భారత పౌరుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అక్కడున్న వారిని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయిన ప్రధాని మోదీ.. సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో విదేశాంగమంత్రి జైశంకర్‌, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అధినేతలతోపాటు విదేశాంగ, రక్షణశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్‌ దౌత్యవేత్తలు పాల్గొన్నట్లు తెలిపాయి.

తరలించే ప్రణాళిక సిద్ధం చేయండి : మోదీ

ఉన్నతస్థాయిలో సమీక్షలో భాగంగా సూడాన్‌లో పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని మోదీ.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను అత్యవసర పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన తరలించే ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితులు వేగంగా మారుతున్నందున పౌరులను తరలించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. ఈ క్రమంలో అక్కడి పొరుగు దేశాలతోనూ టచ్‌లో ఉండాలని అధికారులకు సూచించారు.

ఐరాస చీఫ్‌తో జైశంకర్‌ భేటీ..

‘సూడాన్‌లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. భారతీయుల రక్షణ, వారి భద్రతపై దృష్టి సారించాం. అక్కడి నుంచి తరలించే సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నాం’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ తరుణంలో ఐరాస సెక్రటరి జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. సాధ్యమైనంత తొందరగా ముందస్తు కాల్పుల విరమణ కోసం దౌత్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సూడాన్‌లోని భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయానికి (Indian Embassy In Sudan) వెళ్లొద్దని కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసింది.

మరోవైపు సూడాన్‌లో కొనసాగుతోన్న ఘర్షణల్లో ఇప్పటికే ఓ భారతీయుడు సహా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తమ పౌరులను స్వదేశాలకు తరలించేందుకు వివిధ దేశాలు ముందుకు వస్తున్నా.. విమానాశ్రయాలే రణక్షేత్రాలుగా మారడంతో అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఇలా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. సూడాన్‌లో మొత్తం 4వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. అందులో 1500 మంది అక్కడే స్థిరపడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని