Amit Shah: రిజర్వేషన్ల రద్దుపై అమిత్‌ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు

Amit Shah: అమిత్‌ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 29 Apr 2024 10:16 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సదరు వీడియోలను షేర్‌ చేసిన వారిని అదుపులోకి తీసుకోవచ్చని తెలిపాయి. ఎడిట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్‌ఏ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్‌ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేయడం గమనార్హం.

అమిత్‌ షా (Amit Shah) ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని భాజపా ఆరోపిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండించిన పార్టీ అధికార ప్రతినిధి అమిత్‌ మాలవీయ చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇటీవల హెచ్చరించారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటంతో కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇది సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను కాంగ్రెస్‌ (Congress) పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సోషల్‌ మీడియా ఖాతాలు షేర్‌ చేసినట్లు భాజపా ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని