Punjab Governor: పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామా

Punjab Governor Banwarilal Purohit: పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారు.

Updated : 03 Feb 2024 18:31 IST

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab) గవర్నర్‌, చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ (Banwarilal Purohit) తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను సమర్పించారు. బన్వరీలాల్‌ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 

గత కొంతకాలంగా గవర్నర్‌ బన్వరీలాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌.. సీఎంకు పలుమార్లు లేఖలు రాశారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానంటూ గతేడాది ఆగస్టులో హెచ్చరించారు.

కేజ్రీవాల్‌ ఇంటికి మరోసారి దిల్లీ పోలీసులు

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అటు మాన్‌ సర్కారు కూడా ఆరోపించింది. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య ప్రతిష్టంభన ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై పంజాబ్‌ గవర్నర్‌ను ఉద్దేశిస్తూ.. ‘మీరు నిప్పుతో ఆడుతున్నారు’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.  ఈ పరిణామాల నేపథ్యంలో బన్వరీలాల్‌ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలాఉండగా.. ఇటీవల చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమ్‌ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఎన్నికల్లో కమలం పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. ఆప్‌ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని