PM Security Breach: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. మరో ఆరుగురు పోలీసులపై వేటు

గతేడాది ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యానికి సంబంధించి మరో ఆరుగురు పోలీసులపై వేటు పడింది. 

Updated : 26 Nov 2023 12:33 IST

దిల్లీ: గతేడాది ప్రధాని మోదీ (PM Modi) పంజాబ్‌ (Punjab) పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీసులను పంజాబ్ హోంశాఖ సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి రెండు రోజుల క్రితం అప్పటి ఫిరోజ్‌పూర్ (ప్రస్తుతం ఆయన బఠిండా ఎస్పీ)జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులకు సంబంధించిన ప్రతి వెలుగులోకి వచ్చింది. అందులో మరో ఆరుగురు పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో మొత్తంగా ఏడుగురు పంజాబ్‌ పోలీసులపై వేటు పడింది. సస్పెండ్‌ అయిన వారిలో అప్పటి ఫిరోజ్‌పూర్‌ జిల్లా ఎస్పీతోపాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు.

గతేడాది జనవరి 5న పంజాబ్‌లో ప్రధాని పర్యటించారు. బఠిండా విమానాశ్రయంలో దిగిన ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌ వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయల్దేరారు. మోదీ కాన్వాయ్‌ ఫిరోజ్‌పుర్‌లోని ఓ ఫ్లై ఓవర్‌పైకి చేరుకున్న సమయంలో రైతులు ఆ మార్గాన్ని దిగ్బంధించారు. దీంతో 20 నిమిషాలు ప్రధాని, ఆయన కాన్వాయ్‌ వంతెనపైనే ఉండిపోయింది.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా పర్యటనను ముగించుకుని వెళ్లిపోయారు. దీనిపై గతేడాది జనవరి 12న సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ.. పోలీసుల విధి నిర్వహణలో లోపాలున్నట్లు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా పంజాబ్ హోంశాఖ పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని