సైనికుల కోసం సోలార్‌ టెంట్‌.. ఎలా పనిచేస్తుంది?

సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే చల్లని వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సోలార్‌ టెంట్లను తయారుచేశారు....

Published : 28 Feb 2021 11:55 IST

రూపొందించిన శాస్త్రవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్‌ లోయ సహా అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో మైనస్‌ 40 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు పడిపోతాయి. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సోలార్‌ టెంట్లను తయారుచేశారు. ఆయన గతంలో‌ విభిన్నమైన ఆవిష్కరణలు చేసి పేటెంట్లను కూడా పొందారు. గల్వాన్‌ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం తాజాగా ఈ గుడారాలను‌ రూపొందించారు. 

ఈ సోలార్‌ టెంట్‌ పగటి వేళల్లో సౌర‌ శక్తిని గ్రహించి రాత్రి వేళల్లో ఆ చోటును వెచ్చగా ఉంచుతుంది. హిమాలయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆల్టర్నేటివిస్ట్‌ లద్దాఖ్‌కు చెందిన బృందంతో కలిసి ఈ సోలార్‌ టెంట్‌ను తయారుచేసినట్లు సోనమ్‌ వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. బయట ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో ఉన్నా ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఒక్కో టెంట్‌లో 10 మంది సైనికులు ఉండొచ్చు. ఆ టెంట్‌ బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉండటంతో దాన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సియాచిన్‌, బ్లాక్‌టాప్‌‌ హిల్‌ వంటి చల్లని ప్రదేశాల్లోని సైనికులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. సూపర్ లైట్‌ ఆల్యూమినియమ్‌ మెటీరియల్‌ను ఉపయోగిస్తే టెంట్‌ బరువును మరో 10 కేజీలు తగ్గించవచ్చని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. ఈ శీతాకాలంలో ఎత్తయిన, చల్లని ప్రాంతంలో ఈ టెంటును పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని