Flight: 5 గంటలు విమానంలోనే.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత

Mumbai-Mauritius Flight: రన్‌వేపై ఉన్న ఓ విమానంలో 5 గంటల పాటు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబయి ఎయిర్‌పోర్టులో జరిగిందీ ఘటన.

Updated : 24 Feb 2024 11:22 IST

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌ (Air Mauritius)కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువురు చిన్నారులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.

మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai) నుంచి ఎంకే 749 విమానం ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు మారిషస్‌ (Mauritius) బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులందరిని ఎక్కించారు. అయితే టేకాఫ్‌ చేస్తుండగా ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5 గంటలపాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికుల్లోని పలువురు చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే వారిని కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు గానీ, ఎయిర్ మారిషస్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని