Delta: 98 నమూనాల్లో 97 పాజిటివ్‌!

జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ఫలితాల్లో దాదాపు వందశాతం పాజిటివిటీ రేటు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది....

Published : 20 Jul 2021 01:57 IST

గ్యాంగ్‌టక్‌: జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ఫలితాల్లో దాదాపు వందశాతం పాజిటివిటీ రేటు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ శాతాన్ని తెలుసుకునేందుకు సిక్కిం ప్రభుత్వం 98 మంది నమూనాలను సేకరించింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం వాటిని పశ్చిమ బెంగాల్‌లో ఉన్న కల్యాణ్‌ పట్టణంలోని ఓ ల్యాబ్‌కు పంపించింది. ఇందులో ఆందోళనకర ఫలితాలు వెల్లడయ్యాయి. పంపించిన 98 నమూనాల్లో 97 నమూనాలు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాయి. ఆ 97 మందికి కూడా డెల్టా వేరియంట్‌ సోకినట్లు తేలింది. 

దీనిపై సిక్కిం ఆరోగ్య శాఖ మంత్రి ఎంకే శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘డెల్టా వేరియంట్‌ విస్తృతంగా వ్యాపించడమే కాకుండా.. కొన్ని లక్షణాలు బయటపడి బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. లక్షణాలు బయటపడితే వెంటనే ఆసుపత్రిలో చేరాలని బాధితులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ కట్టడి కోసం.. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి నమూనాలు కూడా సేకరించి వాటిని పరీక్షిస్తామని తెలిపారు. తద్వారా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చర్యలకు ఉపక్రమిస్తామని వెల్లడించారు. సిక్కింలో ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 18 శాతంగా ఉంది.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో నమోదైన 80 శాతం కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా రకానికి 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తిచెందే సామర్థ్యం ఉందని తెలిపారు. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌ను సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్‌ వర్కింగ్‌ నిపుణులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని