Supreme Court: చట్టాలు రూపొందించకుండా అడ్డుకునే అధికారం గవర్నర్‌కు లేదు: సుప్రీం కోర్టు

రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను చట్టాలుగా రూపొందించకుండా అడ్డుకునే అధికారం గవర్నర్‌లకు లేదు అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 

Updated : 24 Nov 2023 12:58 IST

దిల్లీ: రాష్ట్ర శాసనసభలు రూపొందించిన చట్టాలను అడ్డుకునేందుకు గవర్నర్‌లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ్యుల అధికారాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 19, 20 తేదీల్లో పంజాబ్‌ శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని పంజాబ్‌ గవర్నర్‌ భన్వర్‌లాల్‌ పురోహిత్‌ను ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నంబరు 10వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి గురువారం రాత్రి వెబ్‌సైట్‌లో ఉంచారు. 

‘‘శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాటిని పెండింగ్‌లో ఉంచే స్వేచ్ఛ గవర్నర్‌కు ఉండదు. ఎన్నికల ప్రక్రియ ద్వారా గవర్నర్‌ ఎన్నిక కానప్పటికీ.. రాజ్యాంగబద్ధంగా ఆయనకు కొన్ని అధికారాలు ఉంటాయి. వాటిని శాసనసభ చట్టాలు రూపొందించకుండా అడ్డుకునేందుకు ఉపయోగించే అధికారం గవర్నర్‌కు లేదు. పార్లమెంట్‌ ప్రకారం అధికారం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే ఉంటుంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతిగా మాత్రమే వ్యవహరిస్తారు. రాష్ట్రం లేదా దేశానికి సంబంధించి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. ఈ విధానమే ప్రజాస్వామ్య సుస్థిరతకు పునాది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రాజ్యాంగపరమైన నిర్ణయాలకు గవర్నర్‌ మార్గదర్శిలా మాత్రమే వ్యవహరించాలి’’ అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 27 పేజీల తీర్పులో పేర్కొంది.

రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌లు ఆమోదించడంలేదని పంజాబ్‌ సహా తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నవంబరు 10న పంజాబ్ గవర్నర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత వారం కేరళ, తమిళనాడు పిటిషన్లపై విచారణ సందర్భంగా ‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారని?’ తమిళనాడు గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మరోవైపు పెండింగ్ బిల్లులపై జాప్యానికి గల కారణాలు తెలియజేయాలని కేరళ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని