స్టాలిన్‌కు ఎదురుందా?

తమిళనాట సీఎం పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌ తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదుచేసే

Published : 06 Apr 2021 07:45 IST

కొళత్తూరులో హ్యాట్రిక్‌పై డీఎంకే అధినేత కన్ను 


 

తమిళనాట సీఎం పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌ తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు! ‘మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. నన్ను గెలిపించండి’ అంటూ ఓటర్లకు విన్నవిస్తున్నారు. కొళత్తూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ హామీ ఇస్తున్నారు. చెన్నై మహానగరంలోని ఇతర స్థానాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. అన్నాడీఎంకే అభ్యర్థి ఆదిరాజారామ్‌ నుంచి తప్ప మరెవరి నుంచీ స్టాలిన్‌కు చెప్పుకోదగ్గ పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపించడం లేదు.  

తొలి ఎమ్మెల్యే ఆయనే 

రాష్ట్రంలోని వీవీఐపీ నియోజకవర్గాల్లో కొళత్తూరు ఒకటి. 2008లో ఇది ఏర్పడింది. 2011లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కొళత్తూరు తొలి ఎమ్మెల్యేగా స్టాలిన్‌ ఘనత సాధించారు. అప్పుడు 2,734 ఓట్ల మెజారిటీ దక్కించుకున్న ఆయన.. 2016లో 37,730 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కొళత్తూరుకు మారకముందు స్టాలిన్‌ థౌజండ్‌లైట్స్‌ స్థానం నుంచి ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, నాలుగుసార్లు విజయం సాధించారు. 

మెజారిటీ ఎంతన్నదే ప్రశ్న! 

తాజా ఎన్నికల్లో తమ పార్టీ, కూటమి అభ్యర్థుల గెలుపు భారాన్ని భుజాలపై వేసుకున్న స్టాలిన్‌ రాష్ట్రమంతటా పర్యటిస్తూనే.. కొళత్తూరుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో పదిసార్లు పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఆయన నిర్వహిస్తున్న రోడ్‌ షోలకు భారీ స్పందన వస్తోంది. పార్టీ అధినేత పోటీలో ఉండటంతో స్థానికంగా డీఎంకే శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. స్టాలిన్‌ గెలుస్తారా? లేదా? అనేది అసలు ప్రశ్నే కాదని ఆ పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆయనకు మెజారిటీ ఎంత వస్తుందనేదానికోసమే తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. స్టాలిన్‌కు పోటీగా అన్నాడీఎంకే తమ సీనియర్‌ నేత ఆదిరాజారామ్‌ను ఇక్కడ బరిలో దించింది. 2006 ఎన్నికల్లో థౌజండ్‌లైట్స్‌లో స్టాలిన్‌పై ఆదిరాజారామ్‌ పోటీ చేసి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కనిమొళి, రాజా వంటి డీఎంకే సీనియర్‌ నేతలపై అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తుతం తన ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని స్టాలిన్‌ పెద్దగా అభివృద్ధి చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

* నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య: 2,82,299

* బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 36 

పీడిస్తున్న సమస్యలు 

కొళత్తూరులో పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. తమిళేతర భాషలు మాట్లాడేవారు 15% వరకు ఉంటారు. ఇక్కడ భారీ పరిశ్రమలు ఎక్కువగా లేవు. నియోజకవర్గాన్ని చాలా సమస్యలు పీడిస్తున్నాయి. పలుచోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. విద్యుత్తు కేబుళ్లు పూడ్చే పనులు ఇంకా పూర్తికాలేదు. మెట్రోరైలు ప్రాజెక్టు రెండో మార్గం కొళత్తూర్‌ నుంచి వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధమైనా సంబంధిత పనులు ప్రారంభం కాలేదు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అన్నాడీఎంకే పదేళ్ల పాలనపై వారు అసంతృప్తిగా ఉన్నారని.. ఈ దఫా వారంతా తమవైపే మొగ్గుచూపుతారని డీఎంకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిచి స్టాలిన్‌ సీఎం అయితే.. నియోజకవర్గానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని రామచంద్రన్‌ అనే స్థానికుడు పేర్కొన్నారు. - చెన్నై నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని