Nitin Gadkari: సోషల్‌ మీడియా స్టార్‌గా మారిన కేంద్ర మంత్రి

ట్విటర్‌లో 92 లక్షల ఫాలోవర్లు..ఫేస్‌బుక్కులో 16 లక్షలు.. ఇన్‌స్టాగ్రాంలో 13 లక్షలు.. యూట్యూబ్‌లో 2 లక్షల మంది. ఈ గణాంకాలు చూసి ఆయన ఏ సినిమా హీరోనో.. లేదా క్రికెటరో అయ్యుండచ్చు అనుకుంటాం. కనీసం సిక్స్‌ప్యాక్‌ మోడలైనా కావచ్చని భావిస్తాం.

Updated : 20 Sep 2021 09:31 IST

నాగ్‌పుర్‌: ట్విటర్‌లో 92 లక్షల ఫాలోవర్లు..ఫేస్‌బుక్కులో 16 లక్షలు.. ఇన్‌స్టాగ్రాంలో 13 లక్షలు.. యూట్యూబ్‌లో 2 లక్షల మంది. ఈ గణాంకాలు చూసి ఆయన ఏ సినిమా హీరోనో.. లేదా క్రికెటరో అయ్యుండచ్చు అనుకుంటాం. కనీసం సిక్స్‌ప్యాక్‌ మోడలైనా కావచ్చని భావిస్తాం. ఇవేవీ కాదు.. ఆశావహ దృక్పథంతో మాటలకు కాస్త హాస్యం జోడించి ముక్కుసూటిగా గలగలా మాట్లాడే గడ్కరీ. అవును.. మన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీయే. కొవిడ్‌ సంక్షోభ కాలంలో కాలక్షేపంగా ప్రారంభించిన ఉపన్యాసాలు, వంటల వీడియోలతో యూట్యూబ్‌ నుంచి ప్రతినెలా రూ.4 లక్షల రాయల్టీ వస్తున్నట్లు ఇటీవల తనే స్వయంగా వెల్లడించిన విషయం విదితమే. సోషల్‌మీడియా స్టార్‌గా మారిన ఈ కేంద్ర మంత్రి కొత్తపాత్ర గురించి బయటి ప్రపంచానికి తెలియని విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. తనలాగే సంక్షోభంలో కొత్త అవకాశాలు వెదుక్కోవాలని చెప్పే ఈ సచివుడి మాటలకు విద్యార్థులు, వ్యాపారవేత్తలే కాదు.. ఎన్‌ఆర్‌ఐలు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, విదేశీ పెట్టుబడిదారులు కూడా ఫిదా అయిపోతున్నారు. వ్యవసాయం, ఆర్థికప్రగతి.. ఇలా పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడే గడ్కరీ మహారాష్ట్రలోని గడ్చిరోలి గిరిజనులు జీవనం కోసం తేనె, తునికాకు సేకరణలో పడే కష్టాలనూ వివరిస్తారు.

* దిల్లీ, నాగ్‌పుర్‌ నివాసాల నుంచి ఒక్కోసారి రోజుకు అయిదు నుంచి ఏడు వెబినార్లలో కూడా మంత్రి మాట్లాడుతుంటారని ఆయన సహాయకుడొకరు పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు. కరోనా కాలంలో ఇలా ఇప్పటిదాకా దాదాపు 1,500 మేర వర్చువల్‌ భేటీల్లో గడ్కరీ పాల్గొన్నట్లు వెల్లడించారు. జాతీయస్థాయిలో మొదటిసారి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో.. 2020 ఏప్రిల్‌ 2 నుంచి వీడియో లింకుల ద్వారా ఆయన మాటల ప్రవాహం కొనసాగుతోంది. మొదట నోట్లరద్దుపై చేసిన ప్రసంగానికి యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చింది. తనను తాను భోజనప్రియుడిగా పరిచయం చేసుకొన్న ఈ కేంద్రమంత్రి కరోనా వంట చేయడం నేర్పిందంటూ వీడియోల్లో సరదాగా వంటల కబుర్లు కూడా చెబుతారు. వాస్తవానికి 2015 నుంచే గడ్కరీ తన ప్రసంగాలు, కార్యక్రమాలు యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా జనానికి చేరవేస్తున్నా.. కరోనా సంక్షోభ సమయంలో అవి ప్రజలకు మరింత చేరువయ్యాయి. కొన్ని అంతర్జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు కూడా వర్చువల్‌ ప్రసంగాల కోసం ఆయన్ను ఆహ్వానిస్తున్నాయి. ఈ వీడియోలన్నీ ఎప్పటికప్పుడు యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా గడ్కరీ చేసిన ఈ ప్రసంగాలతో నాగ్‌పుర్‌కు చెందిన జర్నలిస్టులు రాహుల్‌ పాండే, సరితా కౌశిక్‌ ‘అన్‌మాస్కింగ్‌ ఇండియా’ పేరిట ఓ పుస్తకం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని