గుట్టు‘చెప్పు’డు కాకుండా.. పరీక్షల్లో బ్లూటూత్‌ సహాయంతో అక్రమాలు

రాజస్థాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్ష (రీట్‌)లో కొందరు అభ్యర్థులు ‘ఆధునిక రీతి’లో అక్రమాలకు తెర లేపారు.

Updated : 27 Sep 2021 13:16 IST

 

జైపుర్‌/బీకానేర్‌: రాజస్థాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్ష (రీట్‌)లో కొందరు అభ్యర్థులు ‘ఆధునిక రీతి’లో అక్రమాలకు తెర లేపారు. ‘బ్లూటూత్‌ అమర్చిన చెప్పులు’ ధరించి అవకతవకలకు పాల్పడ్డారు. ఈమేరకు బీకానేర్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు రీట్‌ అభ్యర్థులు కాగా మరో ఇద్దరు వారికి అతిచిన్న బ్లూటూత్‌ అమర్చిన చెప్పులను సమకూర్చారు. ఇందుకు గాను వారు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 6 లక్షల వంతున వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆదివారం రీట్‌ నిర్వహించారు. 16 జిల్లాల్లో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. రాజస్థాన్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ 3,993 కేంద్రాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షలకు 16.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్నిచోట్ల అవతవకలు చోటు చేసుకున్నాయి. దౌసా, జైపుర్‌ రూరల్‌ ప్రాంతాల్లో 8 మంది ‘డమ్మీ’ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. బీకానేర్‌, అజ్మేర్‌, ప్రతాప్‌గఢ్‌, సికార్‌లలో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు. మరికొన్నిచోట్ల కూడా ఇలాంటి ఉదంతాల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని