icon icon icon
icon icon icon

ప్రచార రణంలో పంచ్‌లు!

‘వేసవిలోనే ఫ్యాన్‌ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్‌ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్‌ లేచిపోయేలా.. జగన్‌ సర్కార్‌ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్‌ను 4లోనో, 5లోనో ఉంచండి’

Updated : 07 May 2024 12:38 IST

ప్రశ్నించి, హెచ్చరించి ఓటుపై అప్రమత్తం చేస్తున్న ఉపన్యాసాలు
తెదేపా, జనసేన సభల్లో ఆలోచింపజేస్తున్న సినీ కళాకారులు

‘వేసవిలోనే ఫ్యాన్‌ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్‌ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్‌ లేచిపోయేలా.. జగన్‌ సర్కార్‌ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్‌ను 4లోనో, 5లోనో ఉంచండి’

కొంత సమాచారం, మరింత వ్యంగ్యం.. కొంచెం అప్రమత్తత, కాసింత ఆవేదన.. ఇలా అన్నీ కలగలిపిన మాటలు ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. సుర్రుమంటున్న ఎండల్లో నవ్వుల జల్లులు కురిపించి సభను చల్లబరుస్తున్నాయి. ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. జనసేన, తెదేపా తరఫున సినీ కళాకారులే నేరుగా రంగంలోకి దిగి.. వైకాపా వైఫల్యాలను వ్యంగ్యంతో రంగరించి వివరిస్తున్నారు. పంచ్‌ పడగానే చప్పట్లతో ఆస్వాదిస్తున్న ప్రజలు.. ఆ తర్వాత చర్చిస్తున్నారు.

ఈనాడు, అమరావతి: ఆకట్టుకునే పంచ్‌ డైలాగ్‌ల హంగామా ఈటీవీ ‘జబర్దస్త్‌’ ఎందరినో హీరోలను చేసింది. మరెందరినో సినీ రంగంలో నిలదొక్కుకునేలా చేసింది. అందులో ఒకరు హైపర్‌ ఆది. ఆది తనదైన పంచ్‌లతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సృజన ఉండాలే గానీ రాజకీయాల్లో రోజూ వ్యంగ్యం విరబూయించొచ్చు. అందుకే ఆదితోపాటు సినీ నటుడు పృథ్వీ, హీరో వరుణ్‌తేజ్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ప్రచార క్షేత్రంలోకి దిగారు. కూటమికి మద్దతుగా ఛలోక్తులను చలామణిలోకి తీసుకొస్తున్నారు. సాధారణంగానే సినీ, టీవీ నటులు అంటే ప్రజలకు ప్రత్యేకాభిమానం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు వస్తారు. కానీ, వారిని సభలో నిలబెట్టాలంటే పంచ్‌లు పేలాలి. అదీ కాలానికి తగినదై, కాకలుతీరిన ప్రత్యర్థి కాళ్లకు బంధనాలు వేసేదై ఉండాలి. అలాంటి పంచ్‌ డైలాగ్‌లే కూటమి సభల్లో మోత మోగుతున్నాయి. అవే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

జగన్‌ మాట తప్పారా లేదా?

‘‘కిందటి ఎన్నికల్లో జగన్‌ ఏం చెప్పారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. ప్రత్యేక హోదా తెచ్చారా... లేదు. సీపీఎస్‌ రద్దు చేశారా.. లేదు. మద్య నిషేధం చేశారా.. లేదు, పోలవరం నిర్మించారా... లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.3,000 చేస్తానన్నారు.. లేదు. ఆయన మాట తప్పుతారు, మడమ తిప్పుతారు. జగన్‌ను నమ్మకండి ఆయనకు ఓటెయ్యకండి’’ అని హైపర్‌ ఆది ప్రచారం చేస్తున్నారు.

ఆయన కుటుంబానికే దిక్కు లేదు?

‘మీ కుటుంబంలో మంచి జరిగిందో లేదో చూడండి. మంచి జరిగితే మళ్లీ వైకాపాకు ఓటు వేయండి అని జగన్‌ అంటున్నారు. అసలు ఆయన కుటుంబంలో మంచి జరిగిందా..’’ అని హైపర్‌ ఆది ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. ‘‘ఆయన చెల్లెళ్లు ఇద్దరూ న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి వచ్చారు. ఆయన కుటుంబానికే మంచి చేయని జగన్‌ మన కుటుంబానికి మంచి చేస్తారా’’ అంటూ సవివరంగా చెప్పేస్తున్నారు. అందుకే.. వైకాపాకు ఓటు వేయవద్దని విన్నవిస్తున్నారు.

ఆయన ‘మీ బిడ్డ’ కాదు..!

‘‘మీ బిడ్డ.. మీ బిడ్డ’నని జగన్‌ ప్రతి సభలో ప్రజలకు చెప్పుకొంటున్నారు. మరి.. బిడ్డగా మనకు ఆయన ఏం చేశారు?’’ అని సూటిగా నిలదీస్తున్నారు. ‘‘అక్కను వేధిస్తున్నారని బాలుడు అమర్‌నాథ్‌ నిలదీస్తే పెట్రోలు పోసి తగలబెట్టారు. ‘మీ బిడ్డ’నని చెప్పుకొనే ఆయన అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు. ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపేసి డోర్‌ డెలివరీ చేస్తే.. అదే ‘మీ బిడ్డ’ ఎందుకు మాట్లాడటం లేదు. దళిత వైద్యుడు సుధాకర్‌ మాస్కు అడిగినందుకు పిచ్చివాణ్ని చేసి చంపేసినా.. ‘మీ బిడ్డ’ ఎందుకు స్పందించరు. ఓ చిన్న పిల్లను ఎందరో చెరిస్తే.. ఆ తల్లి న్యాయం కోసం తిరుగుతూనే ఉంది. ‘మీ బిడ్డ’ అని చెప్పుకొనే జగన్‌కు ఆమె కన్నీళ్లు ఎందుకు కనిపించవు’ అంటూ రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన దాష్టీకాలను ప్రజల కళ్ల ముందుంచుతూనే.. కఠిన పాలకులను నిలదీస్తున్నారు. ‘బటన్‌ నొక్కితే ఆడవాళ్ల ఖాతాలో రూ.15 వేలు పడుతున్నాయంటున్నారు జగన్‌. సాయంత్రం మూత తిప్పితే రూ.30 వేలు మద్యానికి పోతున్నాయ్‌’ అని హైపర్‌ ఆది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మాటలే కాదు.. పాటలు సైతం

  • సినీ నటుడు పృథ్వీ సైతం రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పవన్‌ను ఓడించకుంటే పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ చేసిన సవాల్‌కు పృథ్వీ స్పందిస్తున్నారు. ఎన్నికలైన వెంటనే మేమంతా ఆయన బారసాలకు వెళ్లాలని చమత్కరిస్తున్నారు. తన శాఖ విషయాలు తెలియని రోజా.. మాట్లాడితే పవన్‌ వ్యక్తిగత విషయాలు ఎత్తుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
  • కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఇంతకుముందే పవన్‌కు మద్దతు ఒక పాట విడుదల చేశారు. నల్గొండ గద్దర్‌ పాడిన పాటకు ఆయన నృత్యం చేసి విడుదల చేశారు. జనసేన ప్రచారంలో ఆ పాట మార్మోగుతోంది.
  • సినీ హీరో వరుణ్‌ తేజ్‌ పిఠాపురంలో బాబాయి పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ పిఠాపురం నియోజక వర్గాన్ని ఒక స్థాయిలో నిలబెడతామన్నారు.
  • సినీ నటుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పిఠాపురంలోనే మకాం వేశారు.
  • తెదేపా, కూటమి తరఫున నారా రోహిత్‌ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img