icon icon icon
icon icon icon

2024: చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరం..!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా 2024లో ఎన్నికలను చూడనుంది. వీటి ఫలితాలు భౌగోళిక రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. వీటిల్లో కీలక ఎన్నికల వివరాలు తెలుసుకొందాం.  

Updated : 07 May 2024 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా 2024 నిలవనుంది. ఈసారి చాలాచోట్ల ప్రాంతీయ, జాతీయ ఎన్నికలను జనాలు చూడనున్నారు. అంతేకాదు.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న పది దేశాల్లో ఏడుచోట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో చాలా విశేషాలున్నాయి. మొత్తం 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ఈ భూమిపై ఉన్న 4 బిలియన్ల జనాభాపై వీటి ప్రభావం ఉండనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో పోలింగ్‌ ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. 

అత్యధికంగా ఏడు విడతల్లో భారత్‌లో పోలింగ్‌ జరుగుతోంది. భారత్‌లో ఓటర్ల సంఖ్య 96.8 కోట్ల మంది. 2019 ఎన్నికలతో పోలిస్తే వీరి సంఖ్య 15 కోట్ల వరకు పెరిగింది. 

ఇక ప్రపంచంలోనే అత్యధిక మంది ఒకేరోజు ఓటు హక్కు వినియోగించుకొన్నది మాత్రం ఇండోనేషియా ఎన్నికల్లో.  దాదాపు 20 కోట్ల మంది ఓటర్లలో 82.39 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ఇక టువాలు దేశంలో అతి తక్కువగా 10 వేల మంది లోపే ఓటు వేశారు. 

కిమ్‌ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న ఉత్తర కొరియాలో పార్లమెంటరీ ఎన్నికలు ఏప్రిల్‌ 10న జరుగుతాయని ప్రకటించారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన సమాచారం ఎక్కడా లేదు. ఇక దక్షిణ కొరియా కూడా ఏప్రిల్‌ 10న నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది. 

భారత్‌లో ఇలా..

  • మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో భారత మిత్రురాలిగా పేరున్న షేక్‌ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అయ్యారు. ఇక భూటాన్‌లో త్సెరింగ్‌ టోబ్గేను ప్రజలు ఎన్నుకొన్నారు. ఇవన్నీ భారత్‌కు సానుకూల పరిణామాలే. 
  • తైవాన్‌లో చైనా వ్యతిరేక పార్టీగా పేరున్న డీపీపీకి చెందిన విలియం లాయ్‌చింగ్‌ విజయం సాధించారు. దీంతో తైవాన్‌ పునరేకీకరణపై కలలుకంటున్న బీజింగ్‌కు బ్రేకులు పడ్డట్లైంది. 
  • ఇక పాకిస్థాన్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌ఎన్‌-పీపీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకొంది. ఇమ్రాన్‌ వలే షరీఫ్‌లు మరీ తీవ్రమైన భారత వ్యతిరేక వైఖరిని అవలంభించరనే పేరుంది. మోదీ తొలివిడత పాలనలో పాక్‌లో పర్యటించింది షరీఫ్‌ హయాంలోనే. 
  • ఏప్రిల్‌లో మాల్దీవుల పీపుల్స్ మజ్లిస్‌ (పార్లమెంట్‌)కు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. దీంతో భారత వ్యతిరేకి అయిన అధ్యక్షుడు ముయిజ్జుకు ఆ దేశ చట్టసభల్లో ఎదురులేకుండా పోయింది. 
  • ఆర్థిక ఇబ్బందులతో దివాలా తీసిన శ్రీలంక పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగొచ్చు. ఇక్కడ భారత్‌ అనుకూల పాలకులు ఉన్నారు. ఎన్నికల్లో భారత్‌తో సానుకూల సంబంధాలు కూడా ప్రధానాంశమయ్యే అవకాశం ఉంది. 

విశ్వశక్తుల నాయకత్వాలకు పరీక్ష..

  • ఈ ఏడాది మార్చి 15-17 వరకు రష్యాలో ఎన్నికలు జరిగాయి. అక్కడి పుతిన్‌ను భారీ మెజార్టీతో ఎన్నుకొన్నారు. భారత ప్రధాని ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రిక్స్‌ సమావేశం నిమిత్తం రష్యాకు వెళ్లే అవకాశాలున్నాయి. 
  • ఇక అమెరికాలో నవంబర్‌ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పాత ప్రత్యర్థులైన జోబైడెన్‌-ట్రంప్‌ మరోసారి ముఖాముఖీ తలపడనున్నారు. సాధారణంగా అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.  ట్రంప్‌ మళ్లీ ఎన్నికైతే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు తప్పదని ది ఎకానమిస్ట్‌ పత్రిక అభిప్రాయపడింది. పశ్చిమ దేశాల్లో కూడా ఆయన ఎన్నికపై భయాలు నెలకొన్నాయి. 
  • ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌కు కూడా జూన్‌ 6-9 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధానికి మద్దతు, ఇజ్రాయెల్‌కు అండగా ఉండటం, వలసల అంశాలు, భారత్‌ సహా పలు దేశాలతో వాణిజ్య చర్చలు వంటి అంశాలపై వీటి ఫలితాలు ప్రభావం చూపించనున్నాయి. 
  • యూకేలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ లేబర్‌ పార్టీ కొంత దూకుడుగా ఉంది. రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటీవ్‌ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఇక సునాక్‌ అధికారంలో ఉండగానే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యంపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలూ ఉన్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img