Subhash Chandra Bose: కంగనా వ్యాఖ్యలపై ‘నేతాజీ’ కుమార్తె ఏమన్నారంటే..!

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhash ChandraBose), భగత్‌ సింగ్‌లకు అప్పట్లో మహాత్మా గాంధీ నుంచి మద్దతు లభించలేదని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనితా బోస్‌ (Anita Bose Pfaff) స్పందించారు.

Updated : 17 Nov 2021 14:30 IST

గాంధీ-నేతాజీ మధ్య సంబంధంపై స్పందించిన అనితా బోస్‌

ముంబయి: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhash ChandraBose), భగత్‌ సింగ్‌లకు అప్పట్లో మహాత్మా గాంధీ నుంచి మద్దతు లభించలేదని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనితా బోస్‌ (Anita Bose Pfaff) స్పందించారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌తో మాట్లాడిన ఆమె.. నేతాజీని నియంత్రించలేనని మహాత్మాగాంధీ భావించేవారని.. అందుకే వారిమధ్య కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే ఉండేదని పేర్కొన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని తన తండ్రి సుభాష్‌ చంద్రబోస్‌ ఎంతగానో ఆరాధించేవారని స్పష్టం చేశారు.

‘నేతాజీ, మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ఇద్దరూ భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప హీరోలే. ఒకరిని కాదని మరొకరిని చెప్పలేం. అది ఇద్దరి సంయుక్త పోరాట ఫలితం. భారత స్వాతంత్ర్యం అహింస మార్గం ద్వారానే వచ్చిందని సుదీర్ఘకాలం పాటు కొందరు కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నట్లు కాదు. స్వాతంత్ర్యానికి నేతాజీ, భారత జాతీయ సైన్యం (INA) చర్యలు కూడా దోహదపడ్డాయని మనందరికీ తెలుసు’ అంటూ సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో కేవలం నేతాజీ, ఐఎన్‌ఏ వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పుకోవడం కూడా అర్థంలేని వ్యాఖ్యలని అన్నారు. నేతాజీతో పాటు ఎంతో మందికి మహాత్మా గాంధీ స్ఫూర్తిగా నిలిచారని అనితా బోస్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, ‘నేతాజీని బ్రిటిష్‌ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారు’ అనే శీర్షికతో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను నటి కంగనా రనౌత్‌ తాజాగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. మీరు గాంధీ అభిమానిగానో, నేతాజీ మద్దతుదారుగానో ఉండలేరని.. వీరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్య్రం కోసం పోరాడే వారిని అణచివేతదారులకు అప్పగించేశారు. ఇలా అప్పగించినవారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవు’ అని కంగనా రనౌత్‌ తీవ్రంగా స్పందించారు. అంతకుముందు ‘ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలి’ అంటూ మహాత్మాగాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘అలా చేస్తే దక్కేది స్వాతంత్య్రం కాదు.. అది ‘భిక్షే’ అవుతుంది’’ అంటూ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు