Mamata Banerjee: మమ్మల్ని టార్గెట్‌ చేస్తే.. తిప్పికొట్టడం తెలుసు: మమత

బొగ్గు అక్రమరవాణా కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. తన మేనల్లుడికి ఈడీ సమన్లు జారీ చేయడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. భాజపా తమకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టడం తమకు తెలుసునని వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Aug 2021 21:22 IST

అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు జారీచేయడంపై ఘాటు స్పందన

కోల్‌కతా: బొగ్గు అక్రమరవాణా కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. తన మేనల్లుడికి ఈడీ సమన్లు జారీ చేయడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. భాజపా తమకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టడం తమకు తెలుసునని వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ ఒకటిన రుజిరా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, అదే నెల ఆరున దర్యాప్తు సంస్థ అభిషేక్‌ను ప్రశ్నించనుంది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ..‘ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో మమ్మల్ని బెదిరించవచ్చని వారు అపోహ పడుతున్నారు. ఇలాంటివాటికి బెదరమని వారికి చెప్పాలనుకుంటున్నా. చేతనైతే త్రిపురలో టీఎంసీని అడ్డుకోండి. భాజపా, అమిత్‌ షాకు ఇదే నా సవాలు’ అంటూ విమర్శలు గుప్పించారు. 
 
మరోపక్క తమతో రాజకీయంగా పోరాడాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాకు సవాలు విసిరారు. ‘మాపై ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు. మాకు  ఎలా తిప్పికొట్టాలో తెలుసు. ఈ అవినీతి విషయంలో తృణమూల్ వైపు వేలెత్తి చూపడం వల్ల ప్రయోజనం లేదు. సహజవనరుల కేటాయింపులు కేంద్రం పరిధిలోని అంశం. మా రాష్ట్రంలో బొగ్గు గనుల్ని దోచుకుంటోన్న భాజపా నాయకుల సంగతేంటి?’ అని ఆమె భాజపాపై ఎదురుదాడికి దిగారు. అలాగే ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్‌ ప్రణాళికను తప్పుపట్టారు. ‘ఈ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని చూస్తోంది. రైల్వే, విమానాశ్రయాలు, పీఎస్‌యూలు.. ఇలా అన్నింటిని అమ్మేయాలనుకుటోంది. ఈ దేశంలోని మట్టిని అమ్మగలరా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆస్తుల నగదీకరణ( మానిటైజేషన్) ద్వారా నాలుగేళ్లలో రూ.6లక్షల కోట్లు సమకూర్చడమే లక్ష్యంగా నేషనల్ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను తీసుకొచ్చినట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని