26 రఫేల్‌ విమానాల కొనుగోలు ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం

26 రఫేల్‌ నేవల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన రక్షణశాఖ ప్రతిపాదనలకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) తాజాగా ఆమోదం తెలిపింది.

Updated : 13 Jul 2023 17:12 IST

దిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్‌కు (Modi France tour) బయలుదేరారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా 26 రఫేల్‌ ఎం రకం యుద్ధవిమానాలు, మూడు స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాములను కొనుగోలుకు భారత్‌ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన రక్షణశాఖ ప్రతిపాదనలకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటే 22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌ మెరైన్‌ విమానాలు, నాలుగు రెండు సీట్ల శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి. వీటి కొనుగోలుకు సుమారు రూ.90వేల కోట్ల అవుతున్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ.. ఒప్పందం పూర్తైన తర్వాతే కచ్చితమైన విలువ తెలియనుంది.

వీటితోపాటు ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ కంపెనీ.. భారత్‌కు చెందిన ఒక సంస్థతో కలిసి సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేసే అంశంపైనా ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఒప్పందం పూర్తయితే 22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌-ఎం జెట్‌లు, నాలుగు శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి. వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై మోహరిస్తారు. వాయుసేన కోసం భారత్‌ ఇప్పటికే 36 రఫేల్‌ జెట్‌లను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయగా.. ఆ దేశ సహకారంతో భారత్‌లో ఇప్పటికే ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాములను నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని