ఫీజు కింద నకిలీ నోటు ఇచ్చిన పేషెంట్‌.. డాక్టర్‌ ఏం చేశాడో తెలుసా?

ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ దగ్గరకు వచ్చిన ఓ పేషేంట్‌ ఫీజు కింద నకిలీ రూ.500 నోటును ఇచ్చాడు. దీనికి డాక్టర్‌ సీరియస్‌ అవకపోగా ఇదొక ‘సరదా జ్ఞాపకం’ అని పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. 

Updated : 09 Jul 2023 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డిజిటల్‌ లావాదేవీలు ప్రజల జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది నోట్లకు దూరమయ్యారు. అంతేకాకుండా స్మార్ట్‌ ఫోన్‌లలో లావాదేవీలు జరపడం సులభమైన పద్ధతి కావడంతో, చిల్లర కోసం వేచి చూడాల్సిన అవసరం లేకపోవడంతో  ఎక్కువ మంది దీనికే మొగ్గు చూపుతున్నారు. కానీ కొన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశమున్నా నోట్లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో దొంగ నోట్ల చలామణి కూడా ఎక్కువగా వినిపిస్తోంది. కొంత మంది కావాలనే దొంగ నోట్లు ఇచ్చి మోసం చేస్తుండగా.. మరికొందరు తెలియకుండానే ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సంఘటనే డాక్టర్‌ మనన్‌ వోరాకి ఎదురైంది. ముంబయికి చెందిన మనన్‌ వోరా ఒక ఆర్థోపెడిక్‌ సర్జన్‌. ఇటీవల తన దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్‌ ఫీజు కింద నకిలీ రూ.500 నోటు ఇచ్చి వెళ్లిపోయాడు.  కానీ ఆ డాక్టర్‌ ఏ మాత్రం సీరియస్‌ అవ్వకుండా నవ్వుకున్నారు. పైగా తనకొక సరదా జ్ఞాపకంగా మారిందని కొత్తగా ప్రారంభమైన థ్రెడ్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

‘ఈ మధ్యే ఓ పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. మా రిసెప్షనిస్ట్‌ దాన్ని గమనించలేదు. అయినా నకిలీ నోటు ఇస్తారని ఊహించరు కదా. అది చూసి నాకిక నవ్వు ఆగలేదు. ఈ నోటుని చాలా భద్రంగా  దాచుకున్నాను.  ఇంకో విషయం ఏంటంటే..ఆ నోటు వెనకాల ఫర్ ప్రాజెక్ట్‌ స్కూల్ యూజ్ ఓన్లీ అని రాసుంది’ అని రాసుకొచ్చారు. ఇది నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పోస్టును చూసిన చాలా మంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.   ఫర్జీ వెబ్‌సిరీస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యారేమో అని కొందరు అంటుంటే.. ఆ వ్యక్తెవరో కానీ చాలా తెలివైనవాడు అని మరికొందరు కామెంట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని