26/11 Mumbai Attacks: ముంబయి మారణహోమానికి 14ఏళ్లు.. కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..!

ముంబయి పేలుళ్లు జరిగి 14ఏళ్లు అవుతున్న సందర్భంగా జైశంకర్‌ ట్విటర్‌ వేదికగా మృతులకు నివాళులర్పించారు.

Updated : 26 Nov 2022 10:38 IST

దిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 14ఏళ్లు. అమాయక ప్రజలపై పాకిస్థానీ ముష్కరులు బాంబు పేలుళ్లు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ, ఆ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌.

ముంబయి పేలుళ్లు జరిగి 14ఏళ్లు అవుతున్న సందర్భంగా జైశంకర్‌ ట్విటర్‌ వేదికగా మృతులకు నివాళులర్పించారు. ‘‘మానవాళిని ఉగ్రవాదం భయపెడుతోంది. ఈ రోజు 26/11 సందర్భంగా భారత్‌తో కలిసి యావత్ ప్రపంచం ఆ మారణహోమం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటోంది. ఈ దాడులకు కుట్ర పన్నిన వారిని కచ్చితంగా చట్టం ముందుకు తీసుకొచ్చి శిక్ష విధించాలి. ఉగ్రవాదం కారణంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందే’’ అని ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన చిత్రాలతో కూడిన ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో చివర్లో మోదీ సందేశం కూడా ఉంది. ‘‘ఉగ్రదాడి ఒక్కటైనా.. ఎన్నో జరిగినట్లే. ఒక్క ప్రాణం పోయినా ఎన్నో ప్రాణాలను కోల్పోయినట్లే. అందువల్ల ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేంతవరకూ మేం విశ్రమించం’’ అని ఇటీవల ఓ వేదికపై మోదీ చెప్పిన సందేశాన్ని ఈ వీడియోకు జత చేశారు.

రాష్ట్రపతి నివాళి..

26/11 దాడులు జరిగి 14 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. ‘‘ఈ దాడుల్లో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. విధి నిర్వహణలో ధైర్యంగా పోరాడి ఎంతో మంది భద్రతాసిబ్బంది ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగాలను దేశం స్మరించుకుంటోంది. మృతులకు నివాళులు అర్పిస్తోంది’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

60 గంటలపాటు ఉగ్రదాడి..

ఇదిలాఉంటే, పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు.. నవంబర్‌ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారిచేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని