Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!

Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది.

Published : 29 Apr 2024 10:32 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తిహాడ్‌ జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత (Sunita Kejriwal) అనుమతి కోరారు. అయితే ఇందుకు అధికారులు అంగీకరించలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆప్‌ నేత ఆతిశీకి అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు అధికారులు చెప్పారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

దిల్లీ మంత్రి ఆతిశీ సోమవారం సీఎంతో మాట్లాడనున్నారు. ఇక, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మంగళవారం తిహాడ్‌ (Tihar Jail) జైలుకు వెళ్లి కేజ్రీవాల్‌ను కలవనున్నారు. దీంతో మంగళవారం తర్వాతే సునీతను అనుమతించనున్నట్లు జైలు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం వారంలో రెండుసార్లు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉంది. దీంతో భర్తను చూసేందుకు సునీతకు వచ్చేవారమే అనుమతి లభించనుంది.

మా ప్రచార గీతాన్ని నిషేధించారు: దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణ

అయితే, జైల్లో ఉన్న వ్యక్తితో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తిహాడ్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భగవంత్‌ మాన్‌.. కేజ్రీవాల్‌ను కలిసినప్పుడు పంజాబ్‌ సీఎం వెంట ఆప్‌ జనరల్‌ సెక్రటరీ సందీప్‌ పాథక్‌ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే సునీతను జైలు అధికారులు అనుమతించడం లేదని దుయ్యబట్టారు.

ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి ఆయన తిహాడ్‌ జైల్లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పరిణామాలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే భర్త అరెస్టు నేపథ్యంలో సునీత ప్రచారంలోకి దిగారు. దిల్లీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు