icon icon icon
icon icon icon

మా ప్రచార గీతాన్ని నిషేధించారు

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రచార గీతంపై తాజాగా దుమారం చెలరేగింది! ఆ పాటను ఎన్నికల సంఘం (ఈసీ) నిషేధించిందని దిల్లీ మంత్రి, ఆప్‌ నాయకురాలు ఆతిశీ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.

Published : 29 Apr 2024 04:00 IST

దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణ
మార్పులు మాత్రమే కోరామన్న ఈసీ

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రచార గీతంపై తాజాగా దుమారం చెలరేగింది! ఆ పాటను ఎన్నికల సంఘం (ఈసీ) నిషేధించిందని దిల్లీ మంత్రి, ఆప్‌ నాయకురాలు ఆతిశీ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. తాము నిషేధం విధించలేదని, మార్పులు మాత్రమే కోరామని స్పష్టం చేసింది. ఆప్‌ ప్రచార గీతాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే స్వయంగా రాసి ఆలపించారు. రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఆ పాట.. ‘మా నేతలను జైల్లో వేసినందుకు ఓటుతో సమాధానమిస్తాం’ అంటూ సాగుతుంది. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేశారు. అయితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉందంటూ తమ గీతాన్ని ఈసీ నిషేధించిందని ఆతిశీ తాజాగా ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను, భాజపా ప్రభుత్వాన్ని పాటలో చెడుగా చూపించారని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు చెప్పారు. తాము భాజపా పేరును ఎక్కడా ప్రస్తావించనే లేదని తెలిపారు. ఈ వ్యవహారంపై దిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం స్పందించింది. ఈసీ మార్గదర్శకాలతోపాటు కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నిబంధనలు-1994ను ఉల్లంఘించేలా ఉండటంతో పాటలో మార్పులు చేయాలని మాత్రమే ఆప్‌ను కోరినట్లు వెల్లడించాయి. నిర్ధారణ కాని అంశాల ఆధారంగా అధికార భాజపాను విమర్శించేలా అందులోని కొన్ని వాక్యాలు ఉన్నాయని పేర్కొంది. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థపై నిందలు వేసేలా కూడా ఉన్నాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img