Updated : 16 Jan 2022 18:15 IST

Corona Updates: అక్కడ 10-12 తరగతుల విద్యార్థులకూ సెలవులు; స్టార్‌ హీరోకి పాజిటివ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రభావంతో కొవిడ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 2.71లక్షల కేసులు వెలుగుచూశాయి. కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతుండటంతో మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దేశంలో తాజా కొవిడ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..

తమిళనాట 10-12 తరగతుల విద్యార్థులకూ సెలవులు

చెన్నై: కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు 10, 11, 12 తరగతుల విద్యార్థులకూ సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 10-12 తరగతుల విద్యార్థులకూ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆయా తరగతుల విద్యార్థులకు ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ని కూడా అధికారులు వాయిదా వేశారు. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 23,989 కొత్త కేసులు, 11 మరణాలు నమోదైన విషయం తెలిసిందే.


సూపర్‌ స్టార్‌ మమ్ముట్టికి కరోనా

తిరువనంతపురం: మలయాళం సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. 70 ఏళ్ల మమ్ముట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొవిడ్‌ మహమ్మారి బారినపడినట్టు తెలిపారు. అయితే, స్వల్ప జ్వరం ఉన్నప్పటికీ తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.


రాజస్థాన్‌లో కర్ఫ్యూ.. మార్కెట్లు బంద్‌

జైపూర్‌: కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూతో రాజస్థాన్‌లో ఆదివారం మార్కెట్లు మూసే ఉన్నాయి. పాలు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతి ఇవ్వడంతో అవి మినహా మార్కెట్లో మరే ఇతర దుకాణాలూ తెరుచుకోలేదు. ఒమిక్రాన్‌ ప్రభావంతో కరోనా కేసులు పెరుగుతుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు శనివారం రాత్రి 11గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు జనవరి 9న ప్రభుత్వం  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కర్ఫ్యూని పకడ్బందీగా అమలుచేయాలంటూ ప్రభుత్వం నుంచి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో  మార్కెట్లు, కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, శాంక్చురీలు, టైగర్‌ రిజర్వులు మూసి ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే, కొవిడ్‌ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ జైపూర్‌లోని హవా మహల్‌ వద్ద కొందరు సందర్శకులు ఫొటోలు తీస్తూ కనిపించారు. ప్రజల కదలికలను నియంత్రించేందుకు పలు చోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 58,428 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


ఈ నెలాఖరుకు ఇండోర్‌లో రోజుకు 5వేల కేసులు రావొచ్చు!

ఇండోర్‌: కరోనా మూడో దశలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలో జనవరి చివరి వారం నాటికి కొవిడ్‌ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి ప్రారంభంలో రోజుకు 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కొవిడ్‌ నియంత్రణపై రాష్ట్రస్థాయి సలహా కమిటీ సభ్యుడు డాక్టర్‌ నిశాంత్‌ ఖారే తెలిపారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఇండోర్‌లో 1852 కేసులు నమోదు కాగా.. పాజిటివిటీ రేటు 16.5శాతంగా ఉంది. గత 22 నెలల వ్యవధిలో ఒక్కరోజు ఇంత భారీగా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అన్నారు. గతేడాది ఏప్రిల్‌ 25న ఇండోర్‌లో అత్యధికంగా 1841 కేసులు వచ్చాయని ఆయన తెలిపారు. అలాగే, ఈ దశలో కొవిడ్‌ సోకినవారిలో కేవలం 2శాతం కన్నా తక్కువ మందే ఆస్పత్రిలో చేరుతున్నారని, మిగతా వారంతా హోం ఐసోలేషన్‌లోనే కోలుకుంటున్నారన్నారు. ఇండోర్‌లో బయటపడుతున్న కొత్త కేసుల్లో దాదాపు 80శాతం మందిలో లక్షణాలు కనబడటంలేదన్నారు.


కశ్మీర్‌లో రెండు వారాలుగా కేసులు పెరుగుతున్నాయ్‌..

కశ్మీర్‌ లోయలో కొవిడ్‌ కేసులు గత వారం, రెండు వారాలుగా పెరుగుతున్నట్టు కశ్మీర్‌ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ రాథర్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులూ వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ.. బెడ్‌లు, ఆక్సిజన్‌ వంటి వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలంతా కొవిడ్‌ టీకా తీసుకోవడంతో పాటు కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్