Vande Bharat Express: అన్ని హంగులున్న ‘వందే భారత్‌’లో చెత్తా చెదారం

వందే భారత్‌ రైళ్లను పరిశుభ్రంగా ఉంచడంలో  ప్రయాణికులు అశ్రద్ధ చూపుతున్నారు. బోగీల్లో ఎక్కడికక్కడ వదిలేసిన వాటర్‌ బాటిళ్లు, ఆహారపదార్థాలు దర్శనమిస్తున్నాయి.

Updated : 28 Jan 2023 19:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వందేభారత్‌ రైళ్లలో పరిశుభ్రత లోపిస్తోంది. బోగీల్లో ఎక్కడిక్కడ వదిలేసిన వాటర్‌ బాటిళ్లు, ఆహార పదార్థాలు, పాలిథీన్‌ కవర్లు దర్శనమిస్తున్నాయి.  ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రయాణికులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ తీసిందో తెలియదు గానీ.. చెత్తాచెదారంతో నిండి ఉన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీ ఫొటోను అవనిశ్‌ శరణ్‌ అనే ఐఏఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఓ పారిశుధ్య కార్మికుడు వాటిని చీపురుతో శుభ్రం చేస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. ‘‘వుయ్‌ ద పీపుల్‌’’ అంటూ దానికి క్యాప్షన్‌ కూడా జత చేశారు. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

‘‘భారత ప్రజలు హక్కుల కోసం మాత్రమే పోరాడుతారు, కానీ, తమ బాధ్యతలను విస్మరిస్తారు’’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ప్రజలకు తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు వేల కోట్ల ఖర్చుతో ఈ వందే భారత్‌ రైళ్లను నడుపుతుంటే.. ప్రజలు మాత్రం వాటిని పరిశుభ్రంగా ఉంచకపోవడం చాలా విచారకరమంటూ మరో యూజర్‌ రాసుకొచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 రూట్లలో వందేభారత్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని