Anand Mahindra: రెస్టారంట్‌కి వెళ్లిన ఇద్దరు ప్రపంచ కుబేరులు.. బిల్లు కట్టేదెవరు?

ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్‌ (Elon Musk), బెర్నాండ్‌ ఆర్నాల్ట్‌ (Bernand Arnault) ఇద్దరూ ఓ రెస్టారంట్‌కు వెళ్లాగా.. భోజనం బిల్లు ఎవరు చెల్లించారంటూ ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా సరదాగా ట్వీట్‌ చేశారు.

Published : 18 Jun 2023 19:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సామాజిక మాద్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ఏదైనా ఆసక్తికర విషయం తన దృష్టికి వస్తే.. సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. వాటిలో కొన్ని ఆలోచనలు రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయి. తాజాగా ప్రపంచ కుబేరులు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk ), బెర్నాండ్‌ ఆర్నాల్ట్‌ (Bernand Arnault) ఇద్దరూ పారిస్‌లోని ఓ రెస్టారంట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా వారిద్దరి ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘ ఎలాన్‌ మస్క్‌.. మీ ఇద్దరిలో భోజనం బిల్లు ఎవరు చెల్లించారని నా భార్య తీవ్రంగా ఆలోచిస్తోంది’’ అంటూ సరదాగా రాసుకొచ్చారు. 

ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. వాళ్లు ఆ రెస్టారంట్‌కు వెళ్లడానికి ముందే దానిని కొనేసి ఉంటారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు.. వాళ్లు బిల్లు కట్టక్కర్లేదు.. యాజమాన్యమే తిరిగి వాళ్లకి చెల్లించాలి. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా రెస్టారంట్‌ ప్రచారం జరిగిపోతోంది కదా’ అంటూ కామెంట్‌ చేశారు. కాగా, ఎలాన్‌మస్క్‌ తన తల్లి మయే మస్క్‌తో రాగా.. ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌, అండ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ తన ఇద్దరు కుమారులు అంటోనీ, అలెగ్జాండర్‌తో కలిసి భోజనానికి వచ్చారు. 

భోజనం తర్వాత ఎలాన్‌ మస్క్‌ పారిస్‌లో జరుగుతున్న వివా టెక్నాలజీ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఎల్‌వీఎంహెచ్‌ అధీనంలోని ఎస్‌ఏ అండ్‌ లెస్‌ ఇఖోస్ సంస్థలు ఈ వార్షిక సదస్సును నిర్వహించాయి. పెట్టుబడిదారులను ఓ చోటికి చేర్చడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. మరోవైపు ఫోర్బ్స్‌ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. 236.9 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ ప్రథమ స్థానంలో నిలవగా.. 233.4 బిలియన్‌ డాలర్లతో బెర్నాండ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని