Mamata: నేను బతికుండగా.. ఏ ఒక్కరి పౌరసత్వం పోనివ్వను: దీదీ

తాను బతికి ఉన్నంత కాలం ఏ ఒక్కరి పౌరసత్వాన్ని కోల్పోనివ్వనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు.

Published : 30 Jan 2024 20:12 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి (UCC) వంటి అంశాలను భాజపా ప్రస్తావిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. తాను బతికి ఉన్నంత కాలం ఏ ఒక్కరి పౌరసత్వాన్ని కోల్పోనివ్వనని అన్నారు. ఉత్తర దినాజ్‌పుర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అవకాశవాదంతో భాజపా ఈ అంశాలను లేవనెత్తిందని విమర్శించారు.

‘ఎన్నికల ముందే ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఉమ్మడి పౌరస్మృతి అంశాల గురించి వాళ్లు (భాజపా) మాట్లాడుతున్నారు. ఇది కేవలం రాజకీయమే. అనేక మందికి పౌరసత్వం ఇచ్చాం. వాళ్లు దేశ పౌరులే. అందుకే ఓటు వేసేందుకు వారిని అనుమతిస్తున్నారు. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. నేను బతికున్నంత కాలం పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తే లేదు. ఏ ఒక్కరి పౌరసత్వం తీసివేయడానికీ అనుమతించను’ అని మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు!

వారం రోజుల్లోనే దేశమంతటా సీఏఏ అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్‌ ప్రకటించడంపై దీదీ ఇలా స్పందించారు. సరిహద్దు ప్రాంతాల్లో నివాసమున్న వారికి సైన్యం ప్రత్యేక కార్డులు జారీ చేస్తుందనే వార్తలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే, 2019లో కేంద్రంలో భాజపా ప్రభుత్వం తెచ్చిన సీఏఏ చట్టం... పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లో వేధింపులకు గురై 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌కు తరలివచ్చిన హిందువులు, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవులకు దేశ పౌరసత్వం ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని