Karnataka: ఏనుగు కోసం రాహుల్ వినతి.. ఓకే అన్న బొమ్మై!

గాయపడిన ఏనుగుకు వైద్యం అందించాలని సీఎం బసవరాజ్‌ బొమ్మైని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సాయం కోరగా.. అందుకు సీఎం బసవరాజ్‌ బొమ్మై సానుకూలంగా స్పందించారు.

Published : 06 Oct 2022 14:04 IST

బెంగళూరు: కర్ణాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప్పూనిప్పూలా ఉండే భాజపా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఓ ఏనుగు విషయంలో రాజకీయాలను పక్కన పెట్టారు. గాయపడిన ఏనుగుకు వైద్యం అందించాలని సీఎం బసవరాజ్‌ బొమ్మైని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సాయం కోరగా.. అందుకు సీఎం బసవరాజ్‌ బొమ్మై సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో ‘భారత్‌ జోడో యాత్ర’ సందర్భంగా ఇరు పార్టీ నేతలూ కత్తులు దూసుకుంటున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

భారత్‌ జోడో యాత్ర విరామం సందర్భంగా రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో కలిసి బుధవారం నాగరహళ్లి టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించారు. అక్కడ ఓ గున్న ఏనుగు గాయపడి ఉండడం ఆయన గమనించారు. వెంటనే గాయపడిన గున్న ఏనుగు తన తల్లి వద్ద సేద తీరుతూ ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ఆ గాయపడిన ఏనుగుకు వైద్య సాయం అందించాలని కోరుతూ సీఎం బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాశారు. రాజకీయాలు పక్కన పెట్టి తన వినతిపై స్పందించాలని కోరారు.

దీనిపై బొమ్మై సానుకూలంగా గురువారం స్పందించారు. అటవీ అధికారులతో మాట్లాడాతానని, అన్ని వివరాలూ తెప్పించుకుంటానని పేర్కొన్నారు. గాయపడిన ఏనుగుకు ఏవిధమైన వైద్య సాయం అందించగలమన్న చర్చిస్తామన్నారు. ఏనుగును రక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ వినతి మేరకు మానవతా దృక్పథంతో తాను స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని