800 the movie review: ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ‘800’ ఎలా ఉంది?

శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో ఎంఎస్ శ్రీపతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Updated : 05 Oct 2023 18:25 IST

800 The Movie Review; చిత్రం: 800; న‌టీన‌టులు: మధుర్ మిత్తల్‌, మహిమా నంబియార్, నరేన్, వేల తదితరులు; నిర్మాత: వివేక్ రంగాచారి; సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్; ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్; సంగీతం: జిబ్రాన్‌; రచన, దర్శకత్వం: ఎంఎస్ శ్రీపతి; బ్యానర్: మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్‌; విడుదల తేదీ: 06-10-2023

శ్రీలంక స్టార్ క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్. టెస్ట్ మ్యాచ్‌ల్లో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెట‌ర్ ఆయ‌న‌. టెస్ట్ మ్యాచ్‌ల్లో 22 సార్లు ప‌ది వికెట్లు, 67 సార్లు ఐదు వికెట్లు ప‌డ‌గొట్టిన రికార్డు ఆయ‌న‌ది. ఇలా ఎన్నెన్నో ఘ‌న‌త‌ల్ని సొంతం చేసుకున్న ఆయ‌న క్రికెట‌ర్‌గానే కాదు... వ్య‌క్తిగ‌త జీవితంలోనూ స్ఫూర్తినందిస్తాడు. శ్రీలంక‌ తమిళ కుటుంబానికి చెందిన ముత్త‌య్య  ఎన్నో స‌వాళ్ల‌ని ఎదుర్కొంటూ ఆ దేశ జ‌ట్టులో చోటు సంపాదించారు. త‌న ప్ర‌తిభా పాటవాల‌తో తిరుగులేని క్రికెట‌ర్‌గా ఎదిగారు. దేశ విదేశాల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయ‌న జీవితం ఆధారంగా రూపొందిన సినిమానే... 800. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?

క‌థేంటంటే: తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. సింహ‌ళం మాట్లాడే వ‌ర్గం... త‌మిళం మాట్లాడే వ‌ర్గాల మ‌ధ్య 70వ ద‌శ‌కంలో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్త‌య్య కుటుంబం ప్రాణాల్ని అర‌చేతిలో పెట్టుకుని దూరంగా  వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. ఘ‌ర్ష‌ణ‌ల ప్ర‌భావం త‌న బిడ్డ‌పై ప‌డ‌కూడ‌ద‌ని ముత్త‌య్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు?ముత్త‌య్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎప్పుడు? ఎలా ఏర్ప‌డింది? త‌ను శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్ల‌ని ఎదుర్కొని ఆట‌గాడిగా రాటుదేలాడు?(800 The Movie Review in telugu) ఆయ‌న 800 వికెట్ల ప్ర‌యాణం  సాగిన విధానం ఎలా సాగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎవ‌రెలా చేశారంటే: ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ అన‌గానే టెస్టుల్లో  800 వికెట్లు తీసిన ఓ స్టార్ ప్లేయ‌రే గుర్తొస్తాడు. శ్రీలంక జ‌ట్టు సాధించిన కీల‌క విజ‌యాల్లో ఆయ‌న ఓ ప్ర‌ధాన భాగ‌స్వామి. కానీ, అది మాత్ర‌మే ఆయ‌న జీవితం కాదు. 800 వికెట్ల  ప్ర‌యాణంలో ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కొన్నాడు. వంద‌ల వికెట్లు సాధించాక కూడా ఆయ‌న బౌలింగ్ యాక్ష‌న్‌పై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. చ‌కింగ్‌, దూస్రా ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొన్నాడు. అలా మ‌చ్చ ప‌డిన ప్ర‌తిసారీ తన నిజాయ‌తీని కొత్త‌గా నిరూపించుకోవాల్సి వ‌చ్చింది. క‌ఠిన‌మైన ఆ స‌మ‌యాల్ని ఆయన ఎదుర్కొని మ‌ళ్లీ మైదానంలో త‌న స‌త్తా చాటిన తీరు స్ఫూర్తిదాయ‌కం. క్రికెట్‌ని ఫాలో అయ్యేవాళ్ల‌కి ఈ విష‌యాల‌న్నిటిపైనా ఎంతో కొంత అవ‌గాహన ఉండొచ్చు. కానీ, ముత్త‌య్య క్రికెట‌ర్‌గానే కాదు... వ్య‌క్తిగ‌త జీవితంలోనూ చిన్న‌ప్ప‌ట్నుంచీ స‌వాళ్లు ఎదుర్కొన్నారు. బాల్యంలోనే త‌ల్లిదండ్రుల‌కి దూరంగా గ‌డపాల్సి వ‌చ్చింది. ఎన్నో క‌ఠిన స‌మ‌యాల్ని ఎదుర్కొని క్రికెట‌ర్‌గా ఎదిగే క్ర‌మం ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  ముత్త‌య్య బాల్యం నుంచి మొద‌ల‌య్యే ఈ క‌థ ఆయ‌న 2010లో తీసిన 800వ వికెట్ వ‌ర‌కూ సాగుతుంది.  త‌మిళుడిగా శ్రీలంక జ‌ట్టులో చోటు సంపాదించేందుకు ఆయ‌న ప‌డిన క‌ష్టం...ఎదురైన అవ‌మానాలు  ప్ర‌థ‌మార్ధంలో భావోద్వేగాల్ని పంచుతాయి. శ్రీలంక‌లో వివ‌క్ష ఎలా ఉండేదో, అక్క‌డి త‌మిళుల ప‌రిస్థితిని ఆరంభంలో క‌ళ్ల‌కు క‌ట్టారు. (800 The Movie Review in telugu) ఆ ప‌రిస్థితుల మ‌ధ్యే ముత్త‌య్య  క్రికెట్‌పై మ‌క్కువ పెంచుకునే క్ర‌మం, ఆట‌పై త‌ప‌న క‌న‌బ‌రిచే తీరు, స్పిన్న‌ర్‌గా మారే క్ర‌మం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ముత్త‌య్య శ్రీలంక జ‌ట్టులో చోటు సంపాదించేదాకా ప్రథమార్ధం సాగితే,  మిగిలిన స‌గ‌భాగంలో క్రీడాకారుడిగా ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు, సాధించిన ఘ‌న‌త‌లు కీల‌కం.

స్పిన్ దిగ్గ‌జంగా ఎదిగే క్ర‌మం ఈ సినిమాకి హైలైట్‌. జ‌ట్టులో చోటు సంపాదించేవ‌ర‌కూ ఓ ర‌క‌మైన స‌వాళ్లు ఎదురైతే, ఆట‌గాడిగా రాణిస్తున్న‌ప్పుడు మ‌రో ర‌క‌మైన స‌వాళ్లు. వీటన్నింటినీ త‌ట్టుకుని త‌న ఐడెంటిటీ ఓ క్రికెట‌ర్‌గానే అని న‌మ్మి అందుకు అనుగుణంగానే న‌డుచుకునే తీరుని సినిమాలో చూపించారు. చ‌కింగ్‌, దూస్రా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో డ్రామా కూడా ఈ సినిమాకి కీల‌కం. మైదానం నుంచి శ్రీలంక జ‌ట్టు వాకౌట్ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, అప్ప‌టి కెప్టెన్ ర‌ణ‌తుంగ... ముత్త‌య్య‌కి మ‌ద్ద‌తుగా నిలిచే క్ర‌మం ఆక‌ట్టుకుంటుంది. సేవా కార్య‌క్ర‌మాల్లో భాగంగా  ఎల్‌.టి.టి.ఈ ప్ర‌భాక‌ర‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపే స‌న్నివేశాలు ద్వితీయార్ధానికి మ‌రో ఆక‌ర్ష‌ణ‌. (800 The Movie Review in telugu) ముత్త‌య్య  వైవాహిక జీవితాన్ని కూడా తెర‌పై ఆవిష్క‌రించారు. వెయ్యి వికెట్లు తీస్తాడ‌నే అంచ‌నాలున్న ముత్త‌య్య అర్ధాంత‌రంగా ఆట‌కి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వెన‌క కార‌ణాల్ని ప‌తాక స‌న్నివేశాల్లో చూపించారు. ఓ సినిమాకి  కావ‌ల్సినంత డ్రామా, భావోద్వేగాలు, మ‌లుపులున్న జీవితం ఇది. వాటిని ప‌క్కాగా సినిమా కొల‌త‌ల‌తో తెర‌పైకి తీసుకొస్తే ప్రేక్ష‌కుడిని మరింత‌గా క‌దిలించొచ్చు, క‌ట్టిప‌డేయొచ్చు. కానీ, నొప్పించ‌క తానొవ్వ‌క అన్న‌ట్టుగా చాలా స‌న్నివేశాల్ని డీల్  చేశారు. దాంతో సినిమా ఆశించిన స్థాయిలో భావోద్వేగాల్ని పంచ‌దు. చాలా చోట్ల ఓ డాక్యుమెంట‌రీ అనుభూతి క‌లుగుతుంది. క్రికెట్ నేప‌థ్యంలో స‌న్నివేశాలు కొన్నింటిని బాగానే తెర‌పైకి తీసుకొచ్చారు కానీ... ముత్త‌య్య క్రీడా జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల్ని అంతే ప్రభావవంతంగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు తడబడ్డాడు. ప‌తాక స‌న్నివేశాల్లో 800వ వికెట్ సాధించే క్ర‌మాన్ని  కూడా  మ‌రింత ఉత్కంఠ‌భరితంగా తెర‌పైకి తీసుకొచ్చే అవ‌కాశం ఉన్నా ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేదు. ముర‌ళీ, మ‌దిమ‌ల‌ర్ వైవాహిక  జీవితాన్ని కూడా పైపైనే స్పృశించారు.

ఎవ‌రెలా చేశారంటే: ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ పాత్ర‌లో మ‌ధుర్ మిత్తల్‌ న‌టించారు. ఆయ‌న బౌలింగ్ స్టైల్‌ని, ఆయ‌న హావ‌భావాల్ని బాగానే అనుక‌రించాడు కానీ... లుక్కే కొన్నిచోట్ల స‌రిగా సెట్ అవ్వ‌లేదు. ఫ్రెంచ్ క‌ట్ గ‌డ్డం, మీస‌క‌ట్టు లుక్ వ‌చ్చేవ‌ర‌కూ తెర‌పై ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ పాత్ర‌ని చూస్తున్న‌ట్టే అనిపించ‌దు. కానీ భావోద్వేగాల్ని మాత్రం బాగా పండించారు. ముర‌ళీ భార్య  మ‌దిమ‌ల‌ర్  పాత్ర‌లో  మ‌హిమా నంబియార్ క‌నిపించేది కొద్దిసేపే.  క‌థని న‌డిపించే పాత్ర‌లో నాజ‌ర్ క‌నిపిస్తారు.(800 The Movie Review in telugu) ర‌ణ‌తుంగ‌, కపిల్ దేవ్‌, షేన్ వార్న్ త‌దితరుల పాత్రల్ని తెర‌పై చూపించిన తీరు బాగుంది. ర‌ణ‌తుంగ పాత్ర‌లో న‌టుడు ఆకట్టుకున్నాడు. అప్ప‌టి జ‌ట్టులోని స‌భ్యుల్ని గుర్తుకు తెచ్చేలా పాత్ర‌ల్ని మ‌లిచిన తీరు బాగుంది. సాంకేత‌కంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జిబ్రాన్ సంగీతం, రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. క్రికెట్ నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని తెర‌పైకి తీసుకొచ్చిన తీరు మెప్పిస్తుంది. ప్ర‌వీణ్ ఎడిటింగ్ బాగుంది.  విస్తృత పరిధి  ఉన్న ఇలాంటి జీవితక‌థ‌ల్ని తెర‌పైకి తీసుకు రావ‌డం క‌త్తిమీద సాములాంటిదే. ద‌ర్శ‌కుడు శ్రీప‌తి త‌న ప‌నితీరుతో మెప్పించారు. కానీ, భావోద్వేగాల్ని పండించ‌డంలోనే ఆశించిన స్థాయిలో క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. నిర్మాణం బాగుంది.

  • బ‌లాలు
  • + ముర‌ళి జీవితంలో ఎత్తు ప‌ల్లాలు
  • + క్రికెట్ నేప‌థ్యంలో స‌న్నివేశాలు
  • + మ‌ధుర్ మిత్తల్ న‌ట‌న
  • బ‌లహీన‌త‌లు
  • - కొర‌వ‌డిన  భావోద్వేగాలు
  • చివ‌రిగా:  800...  జీవితం... ఆట(800 The Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని