aadujeevitham movie review: రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమలాపాల్‌ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 28 Mar 2024 15:00 IST

Aadujeevitham Movie Review; చిత్రం: ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌; నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమలాపాల్‌, జిమ్మీ జీన్‌ లూయిస్‌, శోభ మోహన్‌ తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; సినిమాటోగ్రఫీ: సునీల్‌ కేఎస్‌; ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌; నిర్మాత: బ్లెస్సీ, జిమ్మీ జీన్‌ లూయిస్‌, స్టీవెన్‌ ఆడమ్స్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బ్లెస్సీ; విడుదల: 28-03-2024

కొన్నేళ్ల‌పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొన్న పాన్ ఇండియా చిత్రం ‘ది గోట్ లైఫ్‌ (ఆడు జీవితం). బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా... మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran) కీల‌క పాత్ర పోషించారు. ఎప్ప‌ట్నుంచో వార్త‌ల్లో వినిపిస్తూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  తెలుగులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  మైత్రీ మూవీ మేక‌ర్స్‌కి చెందిన పంపిణీ సంస్థ విడుద‌ల చేసింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?(Aadujeevitham movie review) పృథ్వీరాజ్‌ ఎలా నటించారు?

క‌థేంటంటే: న‌జీబ్ మహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్) (Prithviraj Sukumaran) ఉపాధి కోసమ‌ని త‌న స్నేహితుడు హ‌కీం (కేఆర్ గోకుల్‌)తో క‌లిసి సౌదీ వెళ్తాడు. ఏజెంట్ చేసిన మోసం కార‌ణంగా అనుకున్న ఉద్యోగం దొర‌క్క‌పోగా, బ‌ల‌వంతంగా గొర్రెల్ని కాయ‌డం కోసం తీసుకెళ‌తాడు య‌జ‌మాని. వెళ్లిన ఇద్ద‌రినీ వేర్వేరు చోట్ల వ‌దిలిపెడ‌తాడు. భాష తెలియ‌క, ఎడారి మ‌ధ్య‌లో స‌రైన తిండి, నీళ్లు లేక, య‌జ‌మానుల వేధింపుల‌తో ఎన్నో అవ‌స్థ‌లు ప‌డ‌తాడు న‌జీబ్‌. అక్క‌డి నుంచి త‌ప్పించుకుని తిరిగి వెళ్లిపోవాల‌నుకున్న అతడు ఏం చేశాడు? త‌న‌తోపాటు వ‌చ్చిన హ‌కీంని క‌లిశాడా?త‌న కుటుంబాన్ని మ‌ళ్లీ క‌లుసుకున్నాడా?(Aadujeevitham movie review) త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: 2008లో అత్య‌ధికంగా అమ్ముడైన మ‌ల‌యాళ న‌వ‌ల ‘గోట్ డేస్‌’. నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ న‌వ‌ల రాశారు. ఈ న‌వ‌ల ప్రాచుర్యం పొందిన వెంట‌నే, సినిమాగా తీయాల‌ని ఎంతోమంది ఆ హ‌క్కుల కోసం ప్ర‌య‌త్నించారు. బ్లెస్సీ ఆ న‌వ‌ల హ‌క్కుల్ని కొని ఈ సినిమా కోసం రంగంలోకి దిగారు. మొత్తంగా ప‌ద‌హారేళ్ల క‌ల ఈ సినిమా. దాదాపు ప‌దేళ్ల‌పాటు స్క్రిప్ట్ ప‌నుల్ని.. (Aadujeevitham movie review in telugu)  ఆరేళ్ల‌పాటు చిత్రీక‌ర‌ణను జరుపుకొంది. సుదీర్ఘ కాలం త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఎడారిలో చిక్కుకుపోయిన  వ్య‌క్తులు త‌మ మ‌నుగ‌డ కోసం సాగించే సాహసోపేత‌మైన ప్ర‌యాణ‌మే ఈ చిత్రం.

మన‌మే ఎడారిలో చిక్కుకుపోయామా అనిపించేలా అత్యున్న‌తమైన విజువ‌ల్స్ ఈ సినిమాకి ప్ర‌ధాన హైలైట్‌. ఇంటి ప‌క్క‌నే ఉన్న చెరువులో ప‌నులు చేస్తూ పొట్ట పోసుకునే వ్యక్తి త‌న కుటుంబానికి మంచి భ‌విష్య‌త్తుని ఇవ్వాల‌నుకుని దేశం కాని దేశానికి వెళితే, తీరా అక్క‌డ తాగేందుకు గుక్కెడు నీటికోసం ఇబ్బందులు ప‌డే తీరు మ‌న‌సుల్ని కలిచివేస్తుంది. అది మొద‌లు న‌జీబ్ పాత్ర‌తో క‌లిసి ప్రేక్ష‌కుడు ప్ర‌యాణం చేస్తాడు. ఎడారిలో గొర్రెల కాపరిగా జీవితాన్ని ఒక‌వైపు, ఊళ్లో కుటుంబంతో క‌లిసున్న‌ప్ప‌టి జీవితాన్ని మ‌రోవైపు చూపిస్తూ ప్ర‌థ‌మార్ధాన్ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. ద్వితీయార్ధం మొత్తం మ‌నుగ‌డ కోసం సాగే సాహ‌సోపేత‌మైన పోరాట‌మే. (Aadujeevitham movie review) ఇబ్రహీం ఖాద్రీ (జిమ్మీ జీన్ లూయిస్‌) పాత్ర‌, ప్ర‌యాణాన్నీ ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. ఎడారిలో ప్ర‌యాణం త‌ప్ప మ‌రో అంశం క‌థ‌లో లేక‌పోయినా మ‌ధ్య మ‌ధ్య‌లో థ్రిల్‌ని పంచేలా స‌న్నివేశాల్ని మ‌లిచిన విధానం ఆక‌ట్టుకుటుంది. ప్ర‌థ‌మార్ధంలో రాబందుల స‌న్నివేశాలు, ద్వితీయార్ధంలో విష స‌ర్పాలు, ఎండ‌మావులు, ఇసుక తుపానుల నేప‌థ్యం అబ్బుర ప‌రుస్తాయి. విజువ‌ల్స్‌కి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో నిడివి ఎక్కువ కావ‌డం, క‌థ ఎంత‌కీ ముందుకు సాగ‌క‌పోవ‌డంతో పాత్ర‌లు ప‌డే బాధ‌లకి అంతే లేదా అనే అభిప్రాయం క‌లుగుతుంది. ప‌తాక స‌న్నివేశాలూ సాదాసీదాగానే అనిపిస్తాయి. అయితే, కమర్షియల్‌ హంగులకు పోకుండా ఉన్నది ఉన్నట్లు చూపించడంలో మాత్రం దర్శకుడి ధైర్యాన్ని, ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్న పృథ్వీరాజ్‌ను మెచ్చుకొని తీరాలి.

ఎవ‌రెలా చేశారంటే: పృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran) న‌ట‌న ఈ సినిమాకి ప్రాణం పోసింది. న‌జీబ్ పాత్ర‌లో ఒదిగిపోయారు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుడూ ఆ బాధ‌ని అనుభ‌వించేలా చేస్తాడు. ఆయ‌న తెర‌పై క‌నిపించిన విధానం, పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టికప్పుడు త‌న‌ని తాను మార్చుకుంటూ న‌టించిన తీరు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. తెలుగులో ఆయ‌న చెప్పిన డ‌బ్బింగ్ కూడా చాలా బాగుంది. న‌జీబ్ భార్య సైను పాత్ర‌లో అమ‌లాపాల్ (amala paul) క‌నిపిస్తారు. గృహిణిగా స‌హ‌జంగా న‌టించింది. కేఆర్ గోకుల్‌, జిమ్మీ జీన్ కూడా చాలా బాగా న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  సునీల్ కెమెరా అద్భుతాల్నే సృష్టించింది. ప్ర‌తి ఫ్రేమ్ ఎంతో విలువైన‌దిగా, క‌ళ్లార్ప‌కుండా చూడాల‌నిపించేలా ఉంటుంది. ఎడారి అందాల్ని ఆవిష్క‌రించిన తీరు అబ్బుర‌ప‌రుస్తుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం మ‌రో బ‌లం. ముఖ్యంగా నేప‌థ్య సంగీతంతో క‌ట్టి ప‌డేశాడు. ద‌ర్శ‌కుడు బ్లెస్సీ ఈ క‌థ‌ని ఊహించిన తీరు అద్భుతం. నిడివి ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే ఇంకాస్త బాగుండేది.

  • బ‌లాలు
  • + పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌ట‌న
  • + విజువ‌ల్స్‌..సంగీతం
  • + క‌థా నేప‌థ్యం
  • బ‌లహీన‌త‌లు
  • - నిడివి
  • చివ‌రిగా: ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)...  హృద్యమైన ఎడారి జీవిత పాఠం (Aadujeevitham movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని