Aarambham Review: రివ్యూ: ఆరంభం.. డెజావు కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ఎలా ఉందంటే?

మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలా ఉందంటే?

Updated : 25 May 2024 09:46 IST

చిత్రం: ఆరంభం; తారాగణం: మోహన్‌ భగత్‌, సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి తదితరులు; సంగీతం: సిన్జిత్‌ యర్రంమిల్లి; ఛాయాగ్రహణం: దేవ్‌దీప్‌ గాంధీ; కూర్పు: ఆదిత్య తివారీ, ప్రీతమ్‌ గాయత్రి; నిర్మాత: అభిషేక్‌ వి తిరుమలేశ్‌; దర్శకత్వం: అజయ్‌ నాగ్‌ వి; ఓటీటీ ప్లాట్‌ఫామ్: ‘ఈటీవీ విన్‌’.

దర్శకత్వంలో అనుభవం ఉంటేనే ప్రయోగాత్మక సినిమాలు చేయాలనేది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు నూతన దర్శకులు సైతం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచాలనే ఉద్దేశంతో ఎక్స్‌పెరిమెంట్స్‌ చేశారు. అలాంటి దర్శకుల్లో ఒకరు అజయ్‌ నాగ్‌ వి (Ajay Nag V). ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ మోహన్‌ భగత్‌ (Mohan Bhagat) ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). కొన్ని రోజుల కిత్రం థియేటర్లలో ప్రదర్శితమైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా సాగింది? (Aarambham Review)..

కథేంటంటే?: ఓ గ్రామానికి చెందిన మిగిల్‌ (మోహన్‌ భగత్‌) హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తుంటాడు. ఒకరోజు అక్కడ నుంచి అదృశ్యమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచలేదు.. గోడలు బద్దలుకొట్టలేదు. అయినా ఎలా తప్పించుకున్నాడంటూ జైలు అధికారులు తలలు పట్టుకుంటారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు డిటెక్టివ్‌ చేతన్‌ (రవీంద్ర విజయ్‌)ని పిలిచి, తమకు సాయం చేయమని కోరతారు. అలా రంగంలోకి దిగిన చేతన్, అతడి అసిస్టెంట్‌కు.. మిగిల్‌ రాసిన డైరీ దొరుకుతుంది. మరోవైపు, జైల్లో మిగిల్‌తో క్లోజ్‌ ఉన్న గణేశ్‌ (లక్ష్మణ్‌ మీసాల)ను వారు విచారిస్తారు. ఈ క్రమంలో డెజావు ప్రయోగం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అసలు అదేంటి? ప్రాణాలకు సైతం ముప్పు ఉన్న ఆ ఎక్స్‌పెరిమెంట్‌కు నాంది పలికిన ఫ్రొఫెసర్‌ సుబ్రహ్మణ్య రావు (భూషణ్‌ కల్యాణ్‌)తో మిగిల్‌కు ఉన్న సంబంధమేంటి? హీరో జీవితంలో తన తల్లి లీలమ్మ (సురభి ప్రభావతి), శారద (సుప్రితా సత్యనారాయణ్‌) పాత్రలేంటి? చేతన్‌ ఇన్వెస్టిగేషన్‌ పూర్తయిందా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Aarambham Review in Telugu).

ఎలా ఉందంటే?: టైమ్‌ లూప్‌ కాన్సెప్టు తరహాలోనిదే ఈ డెజావు నేపథ్యం. సవాలుతో కూడుకున్న ఇలాంటి చిత్రాలు చాలా తక్కువ సంఖ్యలో రూపొందుతుంటాయి. కన్నడ నవల ‘నీను నిన్నోళగి ఖైదీ’ ఆధారంగా దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమయాన్ని కథా వస్తువుగా చేసుకుని రూపొందిన ఇలాంటి సినిమాల్లో చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుంది. దీంతో, ప్రేక్షకుడికి కన్‌ఫ్యూజ్‌ తప్పదు. ఈ చిత్రం విషయంలో ప్రథమార్ధంతా క్లారిటీగా ఉన్నా ద్వితీయార్ధంలో కొంత స్పష్టత లోపించింది. కథానాయకుడి జైలు జీవితంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. మిగిల్‌ ఎందుకు జైలుకెళ్లాడు? అందరి కళ్లుగప్పి ఎలా తప్పించుకోగలిగాడు? అతడి నేపథ్యమేంటి?తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగిలే ఆయా సన్నివేశాలు రూపొందించారు. కానీ, వాటిని రివీల్‌ చేసేందుకు వచ్చిన డిటెక్టివ్‌ల పాత్రలు పేలవంగా ఉన్నాయి. డైరీని చదువుతూ హీరో ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడానికే ఆ క్యారెక్టర్లు పరిమితమయ్యాయి.

మిగిల్‌ బాల్యం, అతడి అమాయకత్వం, ఊరి నేపథ్యం, ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యరావుకు హీరో పరిచయమయ్యే సన్నివేశం ఆకట్టుకుంటాయి. పేరుకి సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ అయినా ఎమోషన్స్‌కు పెద్దపీట వేశారు. తల్లీకొడుకుల సెంటిమెంట్‌ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. సైన్సు, లాజిక్స్‌ వగైరా వాటి గురించి లోతుగా చర్చించకుండా సింపుల్‌గా డెజావు కాన్సెప్ట్‌ని పరిచయం చేశారు. కానీ, ప్రొఫెసర్‌ లక్ష్యమేంటన్నది అర్థవంతంగా వివరించలేకపోయారు. టైమ్‌ ట్రావెల్‌ మూవీస్‌ చూసిన వారికి ఇది కొత్తగా అనిపించకపోవచ్చుగానీ చూడనివారికి కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఈ గతాన్ని చెబుతూనే.. మిగిల్‌ గురించి తనకు తెలిసింది డిటెక్టివ్‌లకు గణేశ్‌ వివరించే ఎపిసోడ్‌ని కనెక్ట్‌ చేసిన విధానం మెప్పిస్తుంది. అక్కడ ఎదురయ్యే ట్విస్ట్‌లు సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తాయి. అయితే, కథలో ముందుకెళ్లేకొద్దీ ఆ టెంపో కొనసాగించలేకపోయారు. అనవసర సన్నివేశాలతో సాగదీశారు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అనేలా హీరోయిన్‌, విలన్‌ పాత్రలను క్రియేట్‌ చేశారు. క్లైమాక్స్‌ సంతృప్తికరంగానే ఉంది. సీక్వెల్‌ ఉంటుందనే హింట్‌ ఇచ్చారు (Aarambham Review).

ఎవరెలా చేశారంటే?: అమాయకత్వంతో కూడిన మిగిల్‌ పాత్రలో మోహన్‌ భగత్‌ ఒదిగిపోయారు. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ భూషణ్‌ కల్యాణ్‌ ప్రొఫెసర్‌గా, హీరో తల్లిగా సురభి ప్రభావతి ఆకట్టుకున్నారు. ఖైదీగా లక్ష్మణ్‌, డిటెక్టివ్‌గా రవీంద్ర విజయ్‌ ఫర్వాలేదనిపించారు. హీరోయిన్‌ పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. దర్శకుడు అజయ్‌ నాగ్‌ తొలి ప్రయత్నంలోనే కొత్త పాయింట్‌ని టచ్‌ చేయడం ప్రశంసనీయం. అయితే, కథాగమనంలో అక్కడక్కడా తడబడ్డారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది. మదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేవు.

బలాలు

  • + కాన్సెప్టు
  • + కొన్ని మలుపులు

బలహీనతలు

  • - పేలవమైన డిటెక్టివ్‌ పాత్రలు
  • - సాగదీత
  • చివరిగా: ‘ఆరంభం’.. అక్కడక్కడా ఆసక్తికరం (Aarambham Review)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని