Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్‌ ఉన్నా ఆడిషన్‌ ఇచ్చి: అలియా భట్‌ బర్త్‌డే స్పెషల్‌

అలియా భట్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు..

Updated : 15 Mar 2024 10:25 IST

‘‘ప్రముఖ దర్శక, నిర్మాత కుమార్తె కదా.. అందుకే అవకాశాలొస్తున్నాయి’’.. నటి అలియాభట్‌ (Alia Bhatt)పై ఒకప్పుడు కొందరి అభిప్రాయమిది. సినిమాతోనే వారికి సమాధానం చెప్పాలని ఆమె నిర్ణయించుకుంది. అలా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రయాణాన్ని చూద్దాం..

400 మందితో పోటీపడి..

మహేశ్‌ భట్‌- సోనీ రజ్దాన్‌ దంపతుల కుమార్తె అలియా భట్‌. వీరి పేరు వాడుకోకుండా స్వతహాగా సినిమాల్లో రాణించాలనుకుంది. అందుకే ‘ఒక్క ఛాన్స్‌..’ అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఎట్టకేలకు.. కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (2012)తో హీరోయిన్‌గా పరిచయమైంది. 400 మందితో పోటీ పడి ఆ అవకాశం సొంతం చేసుకుంది. స్టూడెంట్‌ పాత్రలో ఒదిగిపోయేందుకు మూడు నెలల్లో 16 కిలోల బరువు తగ్గింది. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించి, ‘హైవే’, ‘2 స్టేట్స్‌’, ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ తదితర చిత్రాల అవకాశాలు సొంతం చేసుకుంది. ‘‘నా కెరీర్‌ ప్రారంభంలో నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా నెపోటిజం ప్రస్తావన వచ్చేది. సినీ బ్యాగ్రౌండ్‌ ఉంది కాబట్టే రాణించగలుగుతోందని అనేవారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నా అలా ఎందుకు అంటున్నారో అర్థమయ్యేది కాదు’’ అని తనపై వచ్చిన విమర్శలపై ఓ సందర్భంలో స్పందించింది.

చీరంటే అంత ఇష్టం!

‘ఉడ్తా పంజాబ్‌’, ‘రాజి’, ‘డియర్‌ జిందగీ’, ‘గల్లీ బాయ్‌’, ‘సడక్‌ 2’.. ఇలా సినిమా సినిమాకు వైవిధ్యం ప్రదర్శించిన ఆమెలోని మరో కోణాన్ని చూపించిన దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయన తెరకెక్కించిన ‘గంగూబాయి కాఠియావాడి’ (2022) (Gangubai Kathiawadi) చిత్రంలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డు దక్కించుకుంది. ఆ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకకు పెళ్లి చీరలో వెళ్లి, అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘స్టైలిష్‌ డ్రెస్సులు ధరించి అవార్డుల ఫంక్షన్లకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. నా ఓటు శారీకే. అయినా వేసుకునే దుస్తులు కాదు వాటిని ధరించిన మనిషి ముఖ్యం’’ అని ఆ సమయంలో అభిప్రాయం వ్యక్తం చేసింది.

సీతగా ఆకట్టుకుని..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో టాలీవుడ్‌లోకి ఇంట్రీ ఇచ్చింది. సీత పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది. డబ్బింగ్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్రం’తోనూ మెప్పించింది. గతేడాది ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’తో సందడి చేసిన ఆమె ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ‘జిగ్రా’తో బిజీగా ఉన్న అలియా.. సంజయ్‌ లీలా తెరకెక్కించనున్న ఓ మల్టీస్టారర్‌లో, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో రూపొందనున్న ఓ చిత్రంలో నటించనుంది. 2022లో వచ్చిన ‘డార్లింగ్స్‌’తో నిర్మాతగా మారింది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఆమె వ్యవహరించిన ‘పోచర్‌’ వెబ్‌సిరీస్‌ ఇటీవల ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలై మంచి ఆదరణ పొందింది. తాను ప్రేమించిన నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ వివాహమాడిన సంగతి తెలిసిందే. వీరి పాప పేరు రాహా. పలు సందర్భాల్లో అలియా పంచుకున్న విశేషాలివీ..

మరచిపోలేని జ్ఞాపకం

‘‘నేను ముంబయిలోని జమ్నాబాయ్‌ నర్సీ స్కూల్లో చదువుకున్నా. రోజూ స్కూలుకెళ్లి బాత్‌రూమ్‌లో నిద్రపోయేదాన్ని. ఓ టీచరు నన్ను గమనించి, వారం పాటు తరగతి గదిలోని బెంచీలన్నింటినీ తుడవమని పనిష్మెంట్‌ ఇచ్చారు. ఆ సమయంలో అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కానీ, ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. చేపలు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, రసగుల్లా, పెరుగన్నం, పెసరపప్పు హల్వా వీటిని ఇష్టంగా లాగించేస్తా. ఏవి ఉన్నా లేకపోయినా భోజనంలో మాత్రం పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. మొదటినుంచీ నాకు పిల్లులంటే ఇష్టం. నేను పెంచుకునే పిల్లి పేరు ఎడ్వర్డ్‌’’

ప్రభాస్‌తో నటించేందుకు..

‘‘మొదటి నుంచీ నాకు డైరీ రాయడం అలవాటు. ఎంత ఆలస్యమైనా.. అలసటగా అనిపిస్తున్నా.. డైరీ రాసుకున్నాకే నిద్రపోతా. హీరోయిన్లలో కరీనా, కరిష్మా కపూర్లంటే ఇష్టం. హీరోల్లో షారుక్‌ ఖాన్‌, తెలుగులో ప్రభాస్‌. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటన ఎంతో నచ్చింది. అతడితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని