Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Anweshippin Kandethum Review: టొవినో థామస్‌ కీలకపాత్రలో నటించిన పోలీస్‌ ప్రొసీడల్‌ డ్రామా మెప్పించిందా?

Updated : 11 Mar 2024 15:02 IST

Anweshippin Kandethum Review; చిత్రం: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌; నటీనటులు: టొవినో థామస్‌, అనఘ రవి, థామస్‌, కొట్టాయం నాజర్‌, సిద్ధీఖ్‌, బాబురాజ్‌, నందు, సాదిక్‌ తదితరులు; సంగీతం: సంతోష్ నారాయణన్‌; ఎడిటింగ్‌: సైజు శ్రీధరన్‌; సినిమాటోగ్రఫీ: గౌతమ్‌ శంకర్‌; రచన: జిను వి అబ్రహం; నిర్మాత: డార్విన్‌ కురియకోస్‌, డాల్విన్‌ కురియకోస్‌,  జిను వి అబ్రహం, విక్రమ్‌ మెహ్రా, సిద్ధార్థ్‌ ఆనంద్‌కుమార్‌; దర్శకత్వం: డార్విన్‌ కురియకోస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

చిన్న చిన్న ఎలిమెంట్స్‌ను తీసుకుని, అతి తక్కువ బడ్జెట్‌తో ప్రేక్షకులను రంజింపచేసేలా సినిమాలు తీస్తుంటారు మలయాళ దర్శకులు. అలా వచ్చిన చిత్రమే ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.40 కోట్లు వసూలు చేసింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? (Anweshippin Kandethum Review) తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

కథేంటంటే: ఆనంద్‌ నారాయణన్‌ (టొవినో థామస్‌) ఎస్సై. ఓ యువతి హత్య కేసు విచారణ సమయంలో జరిగిన తప్పిదం వల్ల పోలీస్‌శాఖ, అతడితో పాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తుంది. అయితే, ఈ హత్య కేసును నిజాయతీగా ఇన్వెస్టిగేషన్‌ చేసిన ఆనంద్‌ పనితీరు నచ్చి ఎస్పీ రాజగోపాల్‌ (సిద్ధీఖీ) చెరువెల్లిలో జరిగిన శ్రీదేవి అనే యువతి హత్య కేసు విచారణకు అప్పగిస్తాడు. దీంతో ఆనంద్‌ అతని టీమ్‌ చెరువెల్లి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత కేసు విచారణలో ఆనంద్‌కు ఎదురైన ప్రతిబంధకాలు ఏంటి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆనంద్‌ ఎందుకు సస్పెండ్‌ కావాల్సివచ్చింది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సాధారణంగా హీరోలు పోలీస్‌ అయితే చాలు, విలన్‌ గ్యాంగ్‌ను చితక్కొడతారు.. రౌడీలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తారు.. పరిచయ సన్నివేశానికో ఫైట్‌.. ఇంటర్వెల్‌లో మరో భారీ ఫైట్‌.. ఇక క్లైమాక్స్‌లో హీరోకు బుల్లెట్లు దిగినా విలన్‌ చంపేవరకూ గాయాలపై టించర్‌ కూడా వేసుకోడు. ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’లో హీరో పోలీసే. కానీ, ఒక్క ఫైట్‌ కూడా చేయడు. ఒక్కచోట కూడా తన పాత్ర పరిధి దాటి ప్రవర్తించడు. తాను నమ్మిన నిజం, నిజాయతీ కోసం మాత్రమే నిలబడతాడు. అందుకు కారణం బలమైన కథ.. అందులో ఉండే ఇంటెన్సివ్‌ డ్రామా. ఈ మూవీని మర్డర్‌ మిస్టరీతో కూడిన ఒక పోలీస్‌ ప్రొసీడల్‌ డ్రామాగా తీర్చిదిద్దడంలో దర్శకుడు డార్విన్‌ కురియకోస్‌ మంచి మార్కులు కొట్టేశాడు. సస్పెండ్‌ అయిన ఆనంద్‌.. ఎస్పీ ఆఫీస్‌కు రావడంతో కథ మొదలుపెట్టిన దర్శకుడు.. అంతకుముందు ఏం జరిగిందనే విషయాన్ని చెబుతూ ప్రేక్షకుడిని నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. కాలేజ్‌ నుంచి వస్తున్న లవ్లీ (అనఘ) అనే యువతి కనిపించకుండా పోవడం.. ఆనంద్‌, అతని టీమ్‌ ఒక్కో క్లూను సంపాదిస్తూ, ఆఖరికి ఆమె హత్యకు గురైనట్లు గుర్తించడం వంటి సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. (Anweshippin Kandethum Review) హత్య ఎవరు చేశారో ఆనంద్‌ కనుగొనే సమయానికి ఉన్నతాధికారి వచ్చి అడ్డుపడటంతో ఆ విచారణ అక్కడితో ఆగిపోతుంది. అయితే, న్యాయం, నిజం వైపు నిలబడాలనుకున్న ఆనంద్‌ నిబంధనలకు వ్యతిరేకంగా సొంతంగా ఇన్వెస్టిగేషన్‌ చేస్తాడు. ఆ సీక్వెన్స్‌ చాలా ఆసక్తిగా సాగుతాయి. చర్చి ఫాదర్‌ను విచారించడానికి వెళ్తే స్థానికులు అడ్డుకుంటారు. దీంతో ఆ ఇంటిని సోదా చేసేందుకు ఆనంద్‌ వేసే ప్లాన్‌ భలేగా ఉంటుంది. నిందితుడు ఎవరో కనిపెట్టి కోర్టులో హాజరుపరిచే సమయంలో జరిగే ఘటన మొత్తం ఆనంద్‌ జీవితాన్ని తల్లకిందులు చేస్తుంది. దీంతో అతడు సస్పెండ్‌ అవుతాడు. అదేంటన్నది తెరపై చూడాలి.

ఇక ఎస్పీ ఆదేశాల మేరకు చెరువెల్లి వెళ్లిన ఆనంద్‌, అతని టీమ్‌ అక్కడ శ్రీదేవి హత్య కేసు విచారించడంతో ద్వితీయార్ధాన్ని మొదలుపెట్టిన దర్శకుడు... మళ్లీ అదేతరహా పోలీస్‌ ప్రొసీడల్‌ డ్రామాను నడపటం, ప్రథమార్ధం తరహాలోనే ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ పునరావృతం కావడంతో సినిమా కొద్దిసేపు నెమ్మదిగా సాగుతుంది. శ్రీదేవి హత్య కేసులో ఫస్ట్‌ క్లూ కనుగొనడంతో మళ్లీ కథ పరుగులు పెడుతుంది. పతాక సన్నివేశాల వరకూ ఆ టెంపో కొనసాగుతుంది. (Anweshippin Kandethum Review)  ఒక లెటర్‌పై ఉన్న పోస్టల్‌ స్టాంప్‌ను పట్టుకుని మొత్తం హత్య కేసును ఛేదించే విధానం అలరిస్తుంది. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో హంతకుడిని కనిపెట్టే సీన్‌ సినిమాకే హైలైట్‌. ఆనంద్‌ శ్రీదేవి హత్య కేసును ఛేదించినా, లవ్లీ హత్య కేసు తరహాలోనే ఈ కేసు విషయంలోనూ జరగడం ఒక్కటే కాస్త డ్రా బ్యాక్‌ అనిపిస్తుంది. బహుశా, హీరో పోలీస్‌ అయినంత మాత్రాన అన్నిసార్లు అతడే గెలవాలనేమీ లేదు కదా! అని దర్శకుడు ఆలోచించి ఉండవచ్చు.

ఎవరెలా చేశారంటే: ఎస్సై ఆనంద్‌గా టొవినో థామస్‌ తన పాత్రకు 100శాతం న్యాయం చేశారు. ఎక్కడా కూడా ఆ పాత్రలో అతి కనిపించదు. తాను నమ్మిన నిజం కోసం నిలబడే పోలీస్‌ ఆఫీసర్‌గా బాగా నటించారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.(Anweshippin Kandethum Review) తక్కువ బడ్జెట్‌, పరిమిత లొకేషన్స్‌లోనే సినిమాను ఆకట్టుకునేలా తీయడంలో టీమ్‌ ప్రతిభ కనపడుతుంది. జిను వి అబ్రహం రాసిన కథను అంతే ఆసక్తిగా దర్శకుడు డార్విన్‌ కురియకోస్‌ తీర్చిదిద్దారు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో సాగదీత ఉన్నా,  ఒక మంచి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ చూశామన్న అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఎక్కడా అసభ్య పదాలు, సన్నివేశాలు లేవు.

  • బలాలు
  • + కథ
  • + ఇన్వెస్టిగేషన్‌  సాగే తీరు
  • + టొవినో థామస్‌ నటన
  • బలహీనతలు
  • - ద్వితీయార్ధంలో కొన్ని  సన్నివేశాలు
  • చివరిగా:  ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’ ఈ ఇన్వెస్టిగేటివ్‌ డ్రామా మెప్పిస్తుంది! (Anweshippin Kandethum Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని