Atharva Movie Review: రివ్యూ: ‘అథ‌ర్వ‌’ ప్రయోగంతో ఆకట్టుకున్నాడా!

కార్తీక్ రాజు హీరోగా నటించిన ‘అథ‌ర్వ‌’ (Atharva) సినిమా ఎలా ఉందంటే..!

Published : 01 Dec 2023 10:05 IST

తారాగణం: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ మరియు ఇతరులు. సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్ర‌హ‌ణం: చరణ్ మాధవనేని, సాహిత్యం: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సాప్రగడ, నిర్మాత‌:  సుభాష్ నూత‌ల‌పాటి, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేశ్ రెడ్డి. సంస్థ‌: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్, విడుద‌ల‌:  1 డిసెంబ‌ర్ 2023

తెలుగులో క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కి కొద‌వ లేదు. త‌ర‌చూ ఏదో ఒక సినిమా ఆ నేప‌థ్యంలో రూపొందుతూ ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తూ పొరుగు భాషల్లోని ప్రేక్షకులను కూడా ఆక‌ర్షిస్తుంటాయి. ‘క్ష‌ణం’, ‘హిట్’, ‘హిట్ 2’ త‌దిత‌ర చిత్రాలు తెలుగులో క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల స్థాయిని పెంచాయి. ఆ నేప‌థ్యంలో `అథ‌ర్వ` శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే?

దేవ్ అథ‌ర్వ క‌ర్ణ అలియాస్ క‌ర్ణ‌ (కార్తీక్‌రాజు)కి (Atharva) చిన్న‌ప్ప‌టి నుంచి పోలీస్ అధికారి కావాల‌నేది క‌ల‌. అందుకోసం తీవ్రంగా శ్ర‌మిస్తాడు.  కానీ, త‌న‌కున్న ఆస్థమా శాపంగా మారుతుంది. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నించి చివ‌రికి క్లూస్ టీం విభాగంలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఉద్యోగంలో చేరిన‌ నాటి నుంచి ఎంతో చురుగ్గా ప‌నిచేస్తూ కేసుల్లోని చిక్కుముడుల్ని క్ష‌ణాల్లోనే విప్పి నేర‌స్తులెవ‌రో క‌నిపెడుతుంటాడు. ఇంత‌లోనే త‌న చిన్న‌ప్పుడు స్కూల్లో జూనియ‌ర్ అయిన నిత్య (సిమ్రాన్ చౌద‌రి)ని క‌లుస్తాడు. ఆమెపై ప్రేమ ఉన్నా బ‌య‌టికి చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. నిత్య స్నేహితురాలు, సినీ క‌థానాయిక  జోష్ని (ఐరా), ఆమె ప్రియుడు శివ (శివ‌) హ‌త్య‌కి గుర‌వుతారు. ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలతో మొద‌ట ఒక‌రిని చంపి, ఆ త‌ర్వాత  మ‌రొక‌రు కాల్చుకున్నార‌ని పోలీసులు తేల్చేస్తారు. కానీ, నిత్య అందులో నిజం లేద‌ని అనుమానిస్తుంది. దాంతో క‌ర్ణ త‌న‌దైన శైలిలో ప‌రిశోధ‌న ప్రారంభిస్తాడు. ఎలాంటి ఆధారాలు దొర‌క‌వు. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ఆ కేసును ప‌రిశోధిస్తున్న క‌ర్ణ‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇంత‌కీ ఆ ప్రేమ‌జంట‌ని చంపిందెవ‌రు? ఎందుకు? అనే విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవ‌ల్సిందే (Atharva movie Review).

ఎలా ఉందంటే?
నేర నేప‌థ్యంలో సాగే థ్రిల్ల‌ర్ క‌థ‌లు ఎక్కువ‌గా హ‌త్య‌లు, దోపిడీల చుట్టూనే సాగుతుంటాయి. ఇది కూడా అంతే. కాక‌పోతే అలాంటి కేసుల ప‌రిశోధ‌న కోసం క్లూస్ టీం విభాగంలో ప‌నిచేసే ఓ యువ ఉద్యోగి రంగంలోకి దిగ‌డ‌మే ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా.. త‌న‌కున్న తెలివితేట‌లు, స‌మ‌య‌స్ఫూర్తితో ఆ కేసుల్ని ఛేదించ‌డం ఇందులో కీల‌కం. క‌థానాయ‌కుడి పోలీస్ క‌ల‌.. దాని పూర్తిచేసుకోవడానికి అతడు చేసే ప్ర‌య‌త్నాల‌తో సినిమా ప్రారంభమవుతుంది. అస‌లు క‌థ మాత్రం జోష్ని,  ఆమె ప్రియుడు మ‌ర‌ణించాకే మొద‌ల‌వుతుంది. అప్ప‌టిదాకా స‌గ‌టు క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్మేట్‌లో పాట‌, ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రేమ స‌న్నివేశాలతో క‌థ‌ని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. హీరో ఉద్యోగంలో చేరాక ఓ దోపిడీ కేస్ ప‌రిశోధ‌నని చూపించారు కానీ, అది సాదాసీదాగా గత సినిమాల్లో చూసేనట్టే ఉంటుంది. జోష్ని కేసును భుజాన వేసుకున్నాకే స‌వాళ్లు ఎదుర‌వుతాయి. హీరో త‌న‌దైన శైలిలో ఆధారాల్ని సేక‌రించ‌డం, వాటి ద్వారా అస‌లు నిందితుల కోసం వేట సాగించ‌డం, క‌థ‌లో చోటు చేసుకునే మ‌లుపుల వంటివి ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దారు. ఆ ఎపిసోడ్స్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం.

అయితే, జంట హ‌త్య‌లు చోటు చేసుకోవ‌డం, ఆ వెంట‌నే పోలీసులు హ‌డావిడిగా ఆ కేసును మూసివేయ‌డం వంటి స‌న్నివేశాల త‌ర్వాత ఎవరికైనా దీని వెనుక పోలీస్ పెద్ద‌ల హ‌స్తం ఉందనే విష‌యం అర్థమవుతుంది. క్లూస్ విభాగంలో.. అది కూడా చాలా తెలివితో వ్య‌వ‌హ‌రించే హీరోకి అనుమానం  రాక‌పోవ‌డంతో క‌థ‌లో స‌హ‌జ‌త్వం లోపించిన‌ట్టు అనిపిస్తుంది (Atharva movie Review). అస‌లైన ఆధారం అక్క‌డే దొరికినా, ఆ కోణాన్ని  ప‌ట్టించుకోకుండా హీరో దర్యాప్తు చేయడం సినిమాకి అత‌క‌లేదు. పైగా హీరోకి భావోద్వేగంగా ఆ కేసుతో ఎలాంటి సంబంధం ఉండ‌దు. దాంతో సినిమా అంతా నాట‌కీయంగా సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. ఇలాంటి క‌థ‌లకి త‌ర్కం, ప్రామాణిక‌త కీల‌కం. ఆరంభంలో క్లూస్‌, ఫోరెన్సిక్ విభాగాలు, వాటి ప‌నితీరుని ఎంతో ప్రామాణికంగా చూపించే ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత వాటిని మ‌రిచిపోయి త‌న‌కి అనుగుణంగా క‌థ‌ని మ‌ల‌చ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. ఊహించ‌ని రీతిలో క‌థ‌కి ముగింపునివ్వ‌డం బాగుంది.

ఎవ‌రెలా చేశారంటే?
కార్తీక్ రాజు న‌ట‌న బాగుంది. ప్రేమికుడిగా, క్లూస్ టీంలో ఉద్యోగిగా రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో అలరించాడు. తోటి ఉద్యోగితో క‌లిసి చేసే సంద‌డి కూడా  ఆక‌ట్టుకుంటుంది. నిత్య పాత్ర‌లో సిమ్రాన్ చౌద‌రి న‌ట‌న ప‌ర్వాలేదు. ఆమె సంభాష‌ణలే అత‌క‌లేదు. హ‌న్మ‌కొండ‌లో చ‌దివిన అమ్మాయిలా కాకుండా, ఉత్త‌రాది నుంచి వ‌చ్చిన అమ్మాయి అన్న భావ‌న ప్రేక్షకుడికి క‌లుగుతుంది. ఐరా, శివ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. అర‌వింద్ కృష్ణ‌, క‌బీర్ సింగ్ దుహాన్ వంటి న‌టులున్నా వాళ్ల పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమాకి వంక పెట్ట‌లేం. కెమెరా, సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ద‌ర్శ‌కుడు కొన్ని ఎపిసోడ్స్‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. అయినా క‌థ‌లో లోటుపాట్లు  చాలానే క‌నిపిస్తాయి. మాట‌లు బాగున్నాయి. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టు ఉంది.

బ‌లాలు

+ ద్వితీయార్థంలో కొన్ని మ‌లుపులు
+ కార్తీక్‌రాజు న‌ట‌న.. సంగీతం

బ‌ల‌హీన‌త‌లు
- ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌, క‌థ‌నం
- కొర‌వ‌డిన భావోద్వేగాలు
చివ‌రిగా: అథ‌ర్వ‌.. అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తాడు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని