Bhagavanth Kesari: ఓ ఆడబిడ్డా.. జర పైలం.. భగవంత్‌ కేసరి చెప్పిన ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం

Bhagavanth Kesari: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇందులో ‘బ్యాడ్‌ టచ్‌’ గురించి చెప్పే సన్నివేశానికి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 21 Oct 2023 09:56 IST

‘పాపా.. నీకు వాడు చాక్లెట్‌ ఇచ్చి నీ మీద చేతులేస్తుంటే అది తప్పని తెలియదా?’ - స్కూల్‌ యూనిఫాంలో ఉన్న అయిదేళ్ల చిన్నారిని అడుగుతాడు భగవంత్‌ కేసరి.

‘ఊహూ..’ అని అమాయకంగా చెబుతుంది ఆ పసిపాప చాక్లెట్‌ తింటూనే...

అలా వేయరాని చోట చెయ్యి వేస్తే తప్పని ఆ చిన్నారికి ఎవరో ఒకరు చెబితేనే కదా తెలిసేది.

మరి ఎవరు చెప్పాలి. ఇంట్లో అమ్మ లేదా స్కూల్లో టీచర్‌. కానీ, వాళ్లు చెప్పడం లేదు. చెప్పాలని కూడా చాలా మందికి తెలియదు. కొందరికి చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలన్న సంశయంతో ఆగిపోతున్నారు.

అభంశుభం తెలియని చిన్నపిల్లలపై మేకవన్నె పులుల్లాంటి కొందరు మానవ మృగాలు చేస్తున్న అకృత్యాల గురించి విని తల్లిదండ్రులు ఉలిక్కి పడుతున్నారే తప్ప తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం, ధైర్యం చేయడం లేదు.

ఆడబిడ్డల కోసం ఆ పని చేయడానికి ముందుకు కదిలాడు అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari)

ఆ పాపను ఎత్తుకుని నేరుగా వాళ్ల స్కూల్‌కు వెళ్లాడు. అక్కడి టీచర్లు ఏనాడూ చెప్పని ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం పిల్లలందరికీ వివరంగా చెప్పాడు. అంటే సినిమాకొచ్చిన ప్రతి ఒక్క తల్లికీ, తండ్రికీ, చిన్నారికీ చెప్పాడన్నమాట.

ఏం చెప్పాడు - ఆటో డ్రైవరు, స్కూల్లో ప్యూను, పక్కింటి అంకుల్, ఆఖరికి ఇంట్లో తాతయ్య, అన్నయ్య అయినా సరే.. వేయరాని చోట చేయి వేస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి అమ్మకు చెప్పమని.. అమ్మనే మిమ్మల్ని కాపాడుకుంటుందని.

అమ్మలకూ ఓ మాట చెప్పాడు. ‘మా అడవిలో ఇక్కడ క్రూరమృగాలు తిరుగుతుంటాయి అని బోర్డు ఉంటుంది. కానీ ఈ సమాజంలో మాత్రం మానవ మృగాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి సూచికలూ ఉండవు. కాబట్టి అమ్మలే తమ బిడ్డలకు ఆ జాగ్రత్తలు చెప్పాలని’. ఈ మాట విన్నాక అమ్మలు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.

ఓ కమర్షియల్‌ సినిమాలో, అందులోనూ ఓ అగ్ర హీరో సినిమాలో ఈ అంశాన్ని స్పృశించడం నిజంగా అభినందనీయం. దీని ద్వారా ఓ అవసరమైన మార్పునకు నాంది పలికారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రధాన స్రవంతి సినిమాల ద్వారా ఇలాంటి అంశాలు చర్చిస్తే ఎక్కువ మందికి చేరే అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ సన్నివేశంపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న చర్చే అందుకు నిదర్శనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని