Bramayugam Movie Review: రివ్యూ: భ్రమయుగం.. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Bramayugam Movie Review: మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 23 Feb 2024 17:08 IST

Bramayugam Movie Review; చిత్రం: భ్రమయుగం; నటీనటులు: మమ్ముట్టి, అర్జున్‌ అశోకన్, సిద్ధార్థ్‌ భరతన్, అమల్డా లిజ్, మణికందన్‌ ఆర్‌.ఆచారి; సంగీతం: క్రిస్టో జేవియర్‌; ఛాయాగ్రహణం: షెహనాద్‌ జలాల్‌; రచన, దర్శకత్వం: రాహుల్‌ సదాశివన్‌; నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌; విడుదల తేదీ: 23-02-2024

ప్రయోగాత్మక కథలకు.. వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామా మమ్ముట్టి. ఇప్పుడాయన నుంచి ‘భ్రమయుగం’ అనే మరో ప్రయోగాత్మక చిత్రం బయటకొచ్చింది. పూర్తిగా నలుపు తెలుపు రంగుల్లో రూపొందిన ఇందులో మమ్ముట్టి ఓ భిన్నమైన పాత్ర పోషించారు. ఇది ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకోగా.. ఇప్పుడు తెలుగులోనూ విడుదలైంది. మరి ‘భ్రమయుగం’ వెండితెరపై ఎలాంటి అనుభూతి పంచింది? (Bramayugam Movie Review) అసలీ కథేంటి? మమ్ముట్టి నటన ఎలా అనిపించింది?

కథేంటంటే: అది 17వ శతాబ్దం.. మలబార్‌ తీరం. ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడే తక్కువ కులానికి చెందిన జానపద గాయకుడు దేవన్‌ (అర్జున్‌ అశోకన్‌). తను ఆ రాజు దగ్గర నుంచి తప్పించుకుని ఇంటి దగ్గరున్న తల్లిని కలుసుకునేందుకు మిత్రుడితో కలిసి అటవీ మార్గంలో బయలుదేరుతాడు. కానీ, ఈ క్రమంలో ఆ దట్టమైన అడవిలో తప్పిపోతాడు. అదే సమయంలో తన మిత్రుడ్ని యక్షి (అమల్డా లిజ్‌) తినేస్తుంది. ఒంటరి అయిపోయిన దేవన్‌ ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ.. అటు ఇటు తిరిగి ఓ పెద్ద పాడుబడ్డ  ఇంటిలోకి అడుగు పెడతాడు. అక్కడ యజమాని కొడుమన్‌ పొట్టి (మమ్ముట్టి), వంటవాడు (సిద్ధార్థ్‌ భరతన్‌) మాత్రమే ఉంటారు. చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడని చెప్పి దేవన్‌ను కొడుమన్‌ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్‌కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొద్దిరోజుల్లోనే తను ఆ ఇంట్లో బందీ అయినట్లు తెలుసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. కొడుమన్‌ తన తాంత్రిక విద్యలతో అతణ్ని మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? (Bramayugam Movie Review) అసలు కొడుమన్‌ పొట్టి ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని నిజ స్వరూపం గురించి తెలిసి కూడా వంటవాడు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు? తను.. దేవన్‌ ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇదొక భిన్నమైన డార్క్‌ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌. అలాగే ఈ కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ.. ఒకే పాడుబడ్డ ఇంటిలోనే తిరుగుతుంటుంది. కానీ, ఏ ఒక్క ఫ్రేమ్‌లోనూ చూసిందే మళ్లీ చూస్తున్నామన్న అనుభూతి, కథ ఒకే దగ్గర తిరుగుతుందన్న భావన కలగకుండా తీయడంలో రాహుల్‌ సదాశివన్‌ మంచి మార్కులు కొట్టేశారు. (Bramayugam Movie Review)  ఓ పాడుబడ్డ భవనంలో.. తాంత్రిక విద్యలు నేర్చిన ఓ మంత్రగాడి బారి నుంచి ఓ యువకుడు ఎలా తనని తాను రక్షించుకున్నాడన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. దీంట్లో కులవివక్షను.. అధికారం మనిషిని రాక్షసుడిగా ఎలా మారుస్తుంది? అన్న విషయాల్ని అంతర్లీనంగా చర్చించారు.

దేవన్‌ అడవిలో దారితప్పిపోయి అటు ఇటు తిరుగుతున్న సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తనతో పాటు వచ్చిన మిత్రుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం.. అతన్ని యక్షి తినేయడం.. అది చూసి దేవన్‌ భయంతో అడవిలో పరుగులు తీయడం.. ఈ క్రమంలో పాడుబడ్డ కొడుమన్‌ ఇంట్లోకి అడుగు పెట్టడం.. ఇలా కథ చకచకా పరుగులు పెడుతుంది. కొడుమన్‌గా మమ్ముట్టి పరిచయ సన్నివేశాలు ఆసక్తిరేకెత్తించేలా ఉంటాయి. ఆయన ఇంటి వాతావరణం.. ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి దేవన్‌కు ఎదురయ్యే అనుభవాలు ప్రతిదీ ఉత్సుకత కలిగించేలాగే ఉంటాయి. (Bramayugam Movie Review) విరామానికి ముందు కథలోని అసలు ట్విస్ట్‌ బయటకొస్తుంది. అప్పుడే కొడుమన్‌లోని మరో రూపం ప్రేక్షకులకు పరిచయమవుతుంది. దాన్ని దర్శకుడు చూపించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అలాగే అది ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా చేస్తుంది.

కొడుమన్‌ పొట్టి నేపథ్యం.. ఈ క్రమంలో వచ్చే చుడలన్‌ పొట్టి.. చేతన్‌ల కథ.. అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. కొడుమన్‌ మానవ రూపంలో ఉన్న రాక్షసుడని తెలిసిన తర్వాత నుంచి దేవన్‌ వేేసే ప్రతి అడుగు ఆసక్తిరేకెత్తించేలా ఉంటుంది. (Bramayugam Movie Review)  కొడుమన్‌ సభా మందిరం కిందున్న నేలమాళిగ.. దాంట్లోని మరో ప్రపంచం.. అందులో ఉన్న అఖండ దీపం.. దాన్ని చేరుకునేందుకు దేవన్‌ - వంటవాడు కలిసి వేసే ఎత్తుగడ.. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే భయానక అనుభవాలు అన్ని ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేలా చేస్తాయి. ఇక పతాక సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ మమ్ముట్టి నటనే. కొడుమన్‌ పాత్రలో ఆయన కనిపించిన తీరు.. ఆహార్యం.. పలికించిన హావభావాలు.. నటన అన్నీ ప్రేక్షకుల్ని మురిపిస్తాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన అందర్నీ కట్టిపడేస్తుంది. దేవన్‌ పాత్రలో అర్జున్‌ అశోకన్‌ ఒదిగిన తీరు కూడా అందర్నీ మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో ఆయన.. మమ్ముట్టి నువ్వా-నేనా అన్నట్లు పోటీపడి నటించారు. వంటవాడుగా సిద్ధార్థ్‌ నటన కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. (Bramayugam Movie Review)  యక్షి పాత్ర ఆరంభంలో ఆసక్తిరేకెత్తించినా.. సినిమాలో దానికున్న ప్రాధాన్యమేంటో అర్థం కాదు. దర్శకుడు రాసుకున్న కథ.. దాని కోసం సృష్టించిన భ్రమయుగం అనే ఊహాత్మక ప్రపంచం.. అందులోని పాత్రలు.. అన్నీ ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇక క్రిస్టో స్వరపరిచిన ప్రతి పాట.. కథలో భాగంగా చాలా అర్థవంతంగా ఉంటాయి. నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని కథలో లీనం చేసేలా చేస్తుంది. సినిమా పూర్తిగా నలుపు తెలుపు రంగుల్లో ఉన్నా ప్రతి సీన్‌ తెరపై చాలా అందంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం..
  • + మమ్ముట్టి, అర్జున్‌ అశోకన్‌ నటన..
  • + విరామ, పతాక సన్నివేశాలు, సాంకేతిక విభాగాల పనితీరు
  • బలహీనతలు
  • - అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం..
  • చివరిగా: ‘భ్రమయుగం’.. థ్రిల్‌ పంచే ప్రయాణం (Bramayugam Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని