Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్‌’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే?

Updated : 08 Mar 2024 17:26 IST

Breathe telugu movie | చిత్రం: బ్రీత్‌; తారాగణం: నందమూరి చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా, కేశవ్‌ దీపక్‌, వెన్నెల కిశోర్‌, భద్రం, షేకింగ్ శేషు, జబర్దస్త్‌ అప్పారావు తదితరులు; సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌; ఛాయాగ్రహణం: రాకేశ్‌ హోసమణి; ఎడిటింగ్‌: బొంతల నాగేశ్వర్‌ రెడ్డి; నిర్మాత: నందమూరి జయకృష్ణ; రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా.

‘ధమ్‌’తో తెరంగేట్రం చేసిన నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) 20 ఏళ్ల తర్వాత ‘బ్రీత్‌’ (Breathe)తో హీరోగా మారారు. ఆయన తండ్రి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబరు 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో రిలీజైంది. మరి, ఈ మూవీ స్టోరీ ఏంటి? చైతన్య కృష్ణ కథానాయకుడిగా మెప్పించారా? (breathe telugu movie review)

కథేంటంటే?: పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య వర్మ (కేశవ్‌ దీపక్‌). ఓ రోజు గోల్ఫ్‌ ఆడిన అనంతరం స్పృహ తప్పి పడిపోతాడు. చికిత్స కోసం ఆయన్ను వెంటనే బ్రీత్‌ హాస్పిటల్‌కు తరలిస్తారు. అదే సమయంలో సీఎంను చంపేందుకు కొందరు కుట్ర పన్నుతారు. వారి నుంచి ముఖ్యమంత్రిని రక్షించేందుకు అభి (చైతన్య కృష్ణ) ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లేంటి? సీఎంకు, అభికీ ఉన్న సంబంధమేంటి? అసలు చీఫ్‌ మినిస్టర్‌ను ఎందుకు హత్య చేయించాలనుకున్నారు? అందులో వైద్యుల పాత్ర ఎంత? అనే అంశాలతో ముడిపడిన కథ ఇది (breathe telugu movie review).

ఎలా ఉందంటే: వైద్య వ్యవస్థ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ స్టోరీ ఇది. వైద్యుణ్ని మనిషి రూపంలో ఉన్న దేవుడంటారు. ఆ వృత్తికి కళంకం తీసుకొచ్చే కొందరు మనకు తారసపడుతుంటారు. ప్రాణాల మీదికొచ్చినా డబ్బు కట్టనిదే కొందరు చికిత్స చేసేందుకు నిరాకరిస్తారు. ఆయా ఘటనలు ఎన్నో సినిమాల్లో కీలకంగా నిలిచాయి. దర్శకుడు వంశీకృష్ణ మెడికల్‌ మాఫియాను కథా వస్తువుగా తీసుకుని ‘బ్రీత్‌’ను మలిచారు. ఎవరైనా వీఐపీ అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చేరితే ఆందోళనకర వాతావరణం నెలకొంటుంది. హెల్త్‌ బులెటిన్‌ వచ్చినా లోపల ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక్కోసారి ఆస్పత్రి వర్గాలపైనా అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ఈ సినిమాలోనూ జరిగేది ఇదే. ముఖ్యమంత్రి ఆదివర్మ అస్వస్థతకు గురికావడం, బ్రీత్‌ ఆస్పత్రికి వెళ్లడం, బయట పోలీసుల బందోబస్తు, ఏం జరిగిందో తెలుసుకునేందుకు మీడియా చేసే ప్రయత్నం.. ఇలా హైడ్రామా మధ్యే హీరో ఎంట్రీ ఇస్తాడు. తర్వాత జరిగే పరిణామాలతో.. ఇంతకీ ఈ అభి ఎవరు? సీఎం కోసం ఎందుకు అంతగా పరితపిస్తున్నాడు? అనే సందేహం కలగక మానదు. ఆ టెంపోనే కొనసాగిస్తూ కథను నడిపిస్తే ఆసక్తికరంగా ఉండేది. కానీ, ప్రారంభంలోనే హీరోకి, సీఎంకు ఉన్న కనెక్షన్‌ను రివీల్‌ చేయడంతో సినిమా తేలిపోయినట్లైంది (breathe telugu movie review).

సీఎం ఆదిత్య వర్మ పరిచయం, చికిత్స జరిగే క్రమం, ఓ బాబా మృతికేసు విషయమై జర్నలిస్టు సమాచారం సేకరించడం, సీఎంను హత్య చేసేందుకు వైద్యులూ సహకరిస్తున్నారని అభి తెలుసుకోవడంలాంటి ఎపిసోడ్లతో ప్రథమార్ధాన్ని తీర్చిదిద్దారు. జర్నలిస్టు చేసిన ఇన్వెస్టిగేషన్‌, అభికి ఉపయోగపడేలా రాసుకున్న సీక్వెన్స్‌ బాగుంది. సీఎంకు ముందు ఇంకెంత మందిని వైద్యులు అలా చేసేందుకు ప్రయత్నించారు? అసలు దాని వెనుక ఉన్నది ఎవరు? వంటి ప్రశ్నలకు హీరో సమాధానం రాబట్టే క్రమంలో ఎదురయ్యే కొన్ని మలుపులు థ్రిల్‌ పంచుతాయి. కానీ, కథాగమనం నెమ్మదిగా ఉండటంతో సినిమా చాలా వరకూ ఫస్ట్‌గేర్‌లోనే నడుస్తుంది. దీనికితోడు.. డాక్టర్లుగా వెన్నెల కిశోర్‌, జబర్దస్త్‌ అప్పారావు, పేషెంట్‌గా షేకింగ్‌ శేషు కామెడీ. వీళ్ల ట్రాక్‌ ఇరికించినట్లుగా ఉంటుంది. హీరో ఛేదించే మరికొన్ని రహస్యాలతో ద్వితీయార్ధాన్ని మలిచారు. ఫస్టాఫ్‌లో తలెత్తిన పలు ప్రశ్నలకు సెకండాఫ్‌లో సమాధానాలిచ్చారు. పతాకసన్నివేశాలు ఊహించినట్లే ఉంటాయి (breathe telugu movie review).

ఎవరెలా చేశారంటే?: చైతన్య కృష్ణ సినిమా మొత్తం ఒకే మూడ్‌లో కనిపిస్తారు. అభిగా సీరియస్‌ రోల్ ప్లే చేశారు. హీరోయిన్‌గా నటించిన వైదిక సెంజలియా ఫర్వాలేదు.  టెక్నికల్‌ టీమ్‌ మరింత ఎఫెర్ట్‌ పెట్టాల్సింది. వంశీకృష్ణ కథాలోచన కొత్తదే అయినా అంతే విభిన్నంగా తెరపై ఆవిష్కరించడంలో మెప్పించలేకపోయారు. గతంలో ‘రక్ష’ (జగపతి బాబు), ‘జక్కన్న’ (సునీల్‌) వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన (breathe telugu movie review).

  • బలాలు
  • + కాన్సెప్ట్‌
  • + కొన్ని మలుపులు
  • బలహీనతలు
  • - స్లో నెరేషన్‌
  • - ఆకట్టుకోని పాటలు
  • - ఇరికించిన కామెడీ సీన్స్‌
  • చివరిగా: ‘బ్రీత్‌’.. ట్విస్ట్‌లున్నా... ఊపిరి బిగబట్టి చూసేంత అయితే కాదు. (breathe telugu movie review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని