Captain Miller Telugu Review: రివ్యూ: కెప్టెన్ మిల్ల‌ర్‌.. ధనుష్‌ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

ధనుష్‌ హీరోగా దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రిపబ్లిక్‌ డే సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Published : 27 Jan 2024 02:21 IST

Captain Miller review in telugu| చిత్రం: కెప్టెన్‌ మిల్లర్‌; నటీనటులు: ధనుష్‌, శివ రాజ్‌కుమర్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ నూని; మ్యూజిక్‌: జి.వి. ప్రకాశ్‌కుమర్‌; ఎడిటింగ్‌: నగూరన్‌ రామచంద్రన్‌; నిర్మాణ సంస్థ: సత్య జ్యోతి ఫిల్మ్స్‌; దర్శకత్వం: అరుణ్‌ మాథేశ్వరన్‌; విడుదల: 26-1-2024.

తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అప్పుడు తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా విడుదల కాలేదు. కాస్త ఆలస్యంగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ధనుష్, సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్.. తదితర తారాగణంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళ్దామా.. (Captain Miller review in telugu)

క‌థేంటంటే..: దేశంలో స్వాతంత్ర్యోద్య‌మం కొన‌సాగుతున్న 1930 ద‌శ‌కం అది. శివ‌న్న (శివ‌రాజ్‌కుమార్‌) స్వ‌రాజ్యం కోసం పోరాటం చేస్తుంటే.. అత‌ని తమ్ముడు అగ్నీశ్వ‌ర అలియాస్ అగ్ని (ధ‌నుష్‌) బ్రిటిష్ సైన్యంలో చేరాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అందుకు కారణం.. ఊరిలో కుల వివ‌క్ష‌తతో ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కోవ‌డ‌మే. సైన్యంలో చేరాక అగ్నికి బ్రిటిష‌ర్లు ‘కెప్టెన్ మిల్లర్’ అని పేరు పెడతారు. శిక్ష‌ణ పూర్త‌యిన వెంట‌నే జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌తో అత‌డి ప్ర‌యాణం మ‌లుపు తిరుగుతుంది. తన పైఅధికారిని చంపేసి అక్క‌డి నుంచి త‌ప్పించుకుని వెళ్లిపోతాడు. అందుకు తోటి సైనికుడు అయిన రఫీక్ (సందీప్ కిషన్) సాయం చేస్తాడు. బ్రిటిష్ సైన్యం నుంచి బ‌య‌టికొచ్చాక అగ్ని ఓ దొంగ‌గా మార‌తాడు. త‌న ఊళ్లో ఉన్న చారిత్రాత్మ‌క ఆల‌యంలో విగ్ర‌హాన్ని చోరీ చేస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఆ విగ్ర‌హాన్ని అగ్నీశ్వ‌ర దొంగ‌త‌నం చేయ‌డానికి కార‌ణమేంటి? ఊరిపై దండెత్తిన బ్రిటిష్ సైన్యంపై అగ్ని ఎలా పోరాటం సాగించాడ‌నే అంశాల్ని తెర‌పై చూడాల్సిందే. Captain Miller review in telugu

ఎలా ఉందంటే?: బ్రిటిష్ పాల‌నా కాలంలోకి తీసుకెళ్లిన క‌థ ఇది. అప్ప‌ట్లో మ‌న గ్రామాలు, స‌మాజంలోని అస‌మాన‌త‌ల్ని క‌ళ్ల‌కు క‌డుతుంది. వివ‌క్ష‌కు గురైన ఓ యువ‌కుడి ప్ర‌యాణాన్ని ప‌లు పార్శ్వాల్లో తెర‌పై చూపించారు. నాటి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్ట‌డంలో దర్శ‌కుడు ప్ర‌భావం చూపించాడే కానీ.. క‌థాంశంతో గానీ, పాత్ర‌తో గానీ బ‌ల‌మైన భావోద్వేగాల్ని ఆవిష్క‌రించ‌లేక‌పోయాడు. దాంతో నిస్సార‌మైన స‌న్నివేశాల్ని తెర‌పై చూస్తున్న అనుభవం క‌లుగుతుంది. కుల వివ‌క్ష నేప‌థ్యంలో సినిమాలు కొత్త కాదు. త‌మిళం నుంచి ఈ మ‌ధ్య త‌ర‌చూ ఆ త‌ర‌హా క‌థ‌లు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఈ ద‌శ‌లో అదే అంశంతో సినిమా తీస్తున్న‌ప్పుడు ఇంకేదో కొత్త‌గా చూపించాలి. 1930ల నాటి నేప‌థ్య‌మే కొత్త విష‌యం అనుకున్న ద‌ర్శ‌కుడు.. మిగ‌తా విష‌యాల్ని ప‌ట్టించుకోలేదు. దాంతో సినిమా గాడి త‌ప్పింది. ఫస్టాఫ్‌లో సింహ భాగం పాత్ర‌ల ప‌రిచయ క్ర‌మ‌మే క‌నిపిస్తుంది. క‌థానాయ‌కుడు బ్రిటిష్ సైన్యంలోకి చేరాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వ‌ర‌కూ సంఘ‌ర్ష‌ణ ఆక‌ట్టుకుంటుంది. ‘ఇక్క‌డ ఉంటే చెప్పులు కూడా వేసుకోనివ్వ‌రు, అదే బ్రిటిష‌ర్ల ద‌గ్గ‌రికి వెళితే బూట్లు ఇస్తారు..’ అంటూ స‌మాజంలోని వివ‌క్ష‌ని బ‌లంగా చెప్పారు. కానీ, ఆ త‌ర్వాత నుంచే క‌థానాయ‌కుడికి ఓ ల‌క్ష్యం అంటూ లేక‌పోవ‌డం, ద‌ర్శ‌కుడికీ ఓ అంశాన్ని బ‌లంగా చెప్పాల‌నే ల‌క్ష్యం క‌నిపించ‌క‌పోవ‌డంతో తెర‌పై స‌న్నివేశాలు సాగిపోతుంటాయి త‌ప్ప ప్రేక్ష‌కుల‌పై వాటి ప్ర‌భావం మాత్రం క‌నిపించ‌దు. పోరాట ఘ‌ట్టాలు, ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపులు కాస్త ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. కానీ అప్ప‌టికే సా..గుతూ వ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంది. ప‌లు పార్శ్వాలుగా సాగే క‌థానాయ‌కుడి పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌కు గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. కొన్ని పోరాట ఘ‌ట్టాలు, వాటిలో వాడే ఆయుధాలు ట్రెండీగా క‌నిపించ‌డంతో స‌హ‌జ‌త్వం లోపించిన భావ‌న క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే?: ధ‌నుష్ వ‌న్ మ్యాన్‌ షో ఇది. మూడు గెట‌ప్పుల్లో క‌నిపించి అల‌రిస్తారు. ఆయ‌న చేసిన పోరాట ఘ‌ట్టాలు కూడా అదుర్స్ అనిపిస్తాయి. ధనుష్‌ గ‌త చిత్రాలు గుర్తు చేసేలా ఆయన పాత్ర తీరుతెన్నులు ఉంటాయి. కొంతలో కొంత సినిమాని ఆస‌క్తిక‌రంగా మార్చిందంటే.. అది ధ‌నుష్ న‌ట‌నే అని చెప్పాలి. శివ‌రాజ్‌కుమార్ ఓ బ‌ల‌మైన పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆయ‌న‌, సందీప్‌కిష‌న్ క‌నిపించేది కొద్దిసేపే అయినా క‌థ‌పై ప్ర‌భావం చూపించారు. ప్రియాంక అరుళ్ మోహ‌న్ విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించింది. ఆమె న‌ట‌న, లుక్ మెప్పించినా ఆ పాత్ర‌లో బ‌లం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా జీవీ ప్ర‌కాశ్ సంగీతం, సిద్ధార్థ్ కెమెరా చేసిన మేజిక్ ఈ చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. జీవీ నేప‌థ్య సంగీతంతో మ‌రింత ప్ర‌భావం చూపించారు. సిద్ధార్థ్ త‌న విజువ‌ల్స్‌తో నాటి కాలంలోకి తీసుకెళ్లాడు. ఇత‌ర విభాగాల‌న్నీ మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. దర్శ‌కుడి ర‌చ‌న‌లోనే ప్ర‌ధాన‌మైన లోపం ఉంది. మేకింగ్ ప‌రంగా కూడా అరుణ్ మాథేశ్వ‌ర‌న్ చాలా చోట్ల త‌డ‌బడ్డారు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. Captain Miller review in telugu

  • బ‌లాలు
  • + ధ‌నుష్ న‌ట‌న
  • + క‌థా నేప‌థ్యం
  • + పోరాట సన్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - భావోద్వేగాలు
  • సాగ‌దీత‌గా ద్వితీయార్థం
  • చివ‌ర‌గా: మెప్పించని కెప్టెన్‌ మిల్లర్!
  • గమనిక: ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని