dear movie 2024 review: రివ్యూ: డియర్‌.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?

DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్‌’ మూవీ మెప్పించిందా?

Updated : 12 Apr 2024 16:32 IST

DeAr Movie 2024 Review; చిత్రం: డియ‌ర్‌; న‌టీన‌టులు: జి.వి.ప్ర‌కాశ్‌కుమార్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, కాళీ వెంక‌ట్‌, రోహిణి, ఇళ‌వ‌ర‌సు, తలైవాస‌ల్ విజ‌య్ త‌దిత‌రులు; విడుదల: 12-04-2024

సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంత బిజీగా ఉన్నా... హీరోగానూ సినిమాలు చేస్తుంటారు జి.వి.ప్ర‌కాశ్ కుమార్‌. ఆయ‌న ఎంచుకునే కాన్సెప్ట్‌లు ప్రేక్ష‌కుల్ని  మెప్పిస్తుంటాయి. ఈసారి మంచి న‌టిగా పేరున్న ఐశ్వ‌ర్య రాజేశ్‌తో క‌లిసి ‘డియ‌ర్‌’ (DeAr movie review in telugu) చేశారు. ఈ చిత్రం త‌మిళంలో గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాగా, తెలుగులో శుక్ర‌వారం విడుద‌లైంది. మ‌రి సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

క‌థేంటంటే: ప్రముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో న్యూస్‌రీడ‌ర్‌గా ఉద్యోగం సంపాదించి, ప్ర‌ముఖుల్ని ఇంట‌ర్వ్యూ చేయాల‌న్న‌దే అర్జున్ (జి.వి.ప్ర‌కాశ్‌) క‌ల‌. చిన్న‌పాటి శ‌బ్దాలకు కూడా నిద్ర‌నుంచి లేచిపోయే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. మ‌రోవైపు అర్జున్‌కి పూర్తి భిన్నంగా నిద్ర‌లో గుర‌క పెట్టే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటుంది దీపిక (ఐశ్వ‌ర్య రాజేశ్).  ఈ ఇద్ద‌రూ ఒక‌రి స‌మ‌స్య మ‌రొక‌రికి తెలియ‌కుండా పెళ్లి చేసుకుంటారు. ఆ స‌మ‌స్య‌లు వీరి కాపురంలో ఎలాంటి చిచ్చుకు కార‌ణ‌మ‌య్యాయి? వీరి బంధం నిల‌బ‌డిందా లేదా? తదిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఒక‌రిలో ఉన్న లోపాల్ని మ‌రొక‌రు స్వీక‌రించి ముందుకు సాగ‌డ‌మే ప‌రిపూర్ణ‌మైన వివాహ బంధానికి అర్థం అని చెప్పే క‌థ ఇది. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న విష‌యం మంచిదే కావొచ్చు కానీ, నాట‌కీయ‌త అతిగా అనిపించే నేప‌థ్యాన్ని ఎంచుకోవ‌డంతోనే ఈ సినిమాకి ప్ర‌ధాన స‌మ‌స్య‌. (DeAr movie review in telugu) గుర‌క అనేది చాలా స‌హజ‌మైన విష‌యం. ఆ స‌మ‌స్యని అధిగ‌మించేందుకు  మ‌రో మార్గ‌మే లేద‌న్న‌ట్టుగా క‌థానాయ‌కుడు తీసుకునే నిర్ణ‌యం ప్రేక్ష‌కుడికి ఓ ప‌ట్టాన మింగుడు ప‌డ‌దు. ప్ర‌ధాన జంట మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ అడుగ‌డుగునా సినిమాటిక్‌గా అనిపిస్తుంది త‌ప్ప‌, దానికి ఏ ద‌శ‌లోనూ ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌డు. చెప్పాల‌నుకున్న విష‌యాన్నైనా బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారా అంటే అదీ లేదు. మ‌ధ్య‌లో త‌ల్లిదండ్రుల్ని క‌లిపే ఉప క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చి అస‌లు క‌థ‌ని గాలికొదిలేశారు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. క‌థానాయిక‌కి ఉన్న గుర‌క స‌మ‌స్య‌, క‌థానాయ‌కుడికి ఉన్న శ‌బ్దాల స‌మ‌స్యని ముడిపెట్ట‌డం వ‌ర‌కూ సినిమా స‌రైన ట్రాక్‌లోనే న‌డుస్తున్న‌ట్టు అనిపిస్తుంది. ఆ అంశం నుంచే ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణని సృష్టిస్తూ... క‌థని న‌డిపిస్తారేమో అని ఊహిస్తాం. కానీ, అంత‌లోనే సినిమాని ట్రాక్ త‌ప్పించి, ఉప క‌థ‌ని మొద‌లుపెట్టారు.  దాంతో సినిమా గ‌మ‌నం ఎక్క‌డో మొద‌లై, ఎక్క‌డికో వెళ్లిపోతున్న‌ట్టు అనిపిస్తుంది. (DeAr movie review in telugu) ఈ త‌ర‌హా క‌థ‌తో ఇదివ‌ర‌కు ‘గుడ్‌నైట్‌’ వ‌చ్చింది. అక్క‌డ స‌మ‌స్య క‌థానాయ‌కుడికి ఉంటే, ఇక్క‌డేమో క‌థానాయిక‌కి.  త‌ల్లిదండ్రుల్ని క‌లిపే ఉప క‌థ కూడా కొత్తేమీ కాదు. ఇదివ‌ర‌కు చాలా సినిమాల్లో చూసిందే. ఏ ర‌కంగా చూసినా సినిమాలో కొత్త‌ద‌నం కానీ, క‌నెక్ట్ అయ్యే అంశం కానీ లేకపోవ‌డంతో ద్వితీయార్ధం దాదాపుగా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఈ త‌ర‌హా క‌థ‌ల నుంచి హాస్యం సృష్టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కానీ, ద‌ర్శ‌కుడు ఆ దిశ‌గానూ ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌.

ఎవ‌రెలా చేశారంటే: ఐశ్వ‌ర్య‌రాజేశ్ న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. దీపిక పాత్ర‌లో ఆమె ఒదిగిపోయిన తీరు, భావోద్వేగాల్ని పండించిన విధానం మెప్పిస్తుంది. జి.వి.ప్ర‌కాశ్ పాత్ర‌లో బ‌లం లేదు.  దాంతో ఆయ‌న న‌ట‌న పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. ఇలాంటి సినిమాల‌కి  ప్ర‌ధాన జంట మ‌ధ్య కెమిస్ట్రీ కీల‌కం. (DeAr movie review in telugu) కానీ ఈ సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్యా  కెమిస్ట్రీనే లేదు. రోహిణి, కాళీ వెంక‌ట్, ఇళ‌వ‌ర‌సు పాత్ర‌లు, వాళ్ల న‌ట‌న మెప్పిస్తుంది. ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌విచంద్ర‌న్ ర‌చ‌న‌లో బ‌లం లేదు.  చెప్పాల‌నుకున్న విష‌యం బాగున్నా, దాన్ని ప‌క్క‌గా చెప్ప‌లేక త‌డ‌బాటుకు గురయ్యారు. నిర్మాణం ప‌రంగా లోపాలేమీ లేవు.

  • బ‌లాలు
  • + ఐశ్వ‌ర్య రాజేశ్ న‌ట‌న
  • + ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌, క‌థ‌నాలు
  • - సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌రిగా: సారీ.. డియ‌ర్‌.. గుర్ర్‌... ర్ర్‌... ర్‌..
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని