Dhootha web series review: నాగచైతన్య ఫస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘దూత’.. ఎలా ఉంది?

Dhootha web series review: నాగచైతన్య నటించిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘దూత’ మెప్పించిందా?

Updated : 02 Dec 2023 14:20 IST

Dhootha web series review; వెబ్‌సిరీస్‌: దూత; నటీనటులు: నాగచైతన్య, ప్రియ భవానీ శంకర్‌, పార్వతి తిరువత్తు, ప్రాచీ దేశాయ్‌, రవీంద్ర విజయ్‌, రఘు కుంచె తదితరులు; సంగీతం: ఇషాన్‌ చాబ్రా; సినిమాటోగ్రఫీ: మికోలజ్‌ సైగుల; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; సంభాషణలు: వెంకటేష్‌ దొండపాటి; నిర్మాత: శరత్‌ మరార్‌, విక్రమ్‌ కె కుమార్‌; రచన, దర్శకత్వం: విక్రమ్‌ కె కుమార్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అగ్ర హీరోలతో పాటు, యువ కథానాయకులు సైతం ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలతో పాటు, ఓటీటీ వేదికలగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నాగచైతన్య వచ్చి చేరారు. ఆయన కీలక పాత్రలో విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ నేచురల్‌ వెబ్‌సిరీస్‌ ‘దూత’. ప్రచార చిత్రంతోనే ఆసక్తిరేపిన ఈ సిరీస్‌ ఎలా ఉంది?(Dhootha review in telugu) నాగచైతన్య ఎలా నటించారు?

కథేంటంటే..

సాగర్‌ వర్మ అవధూరి (నాగచైతన్య) ప్రముఖ జర్నలిస్ట్‌. కొత్తగా ప్రారంభం కాబోయే సమాచార్‌ పత్రికకు చీఫ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడి సహాయకురాలిగా అమృత (ప్రాచీ దేశాయ్‌), మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ చంద్రమూర్తి (వి.జయ ప్రకాష్‌)లు కూడా అదే రోజున ఉద్యోగంలో చేరతారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని భార్య ప్రియ (ప్రియా భవానీ శంకర్‌), కుమార్తె అంజలి, పెంపుడు కుక్క ‘ఎ’తో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ హోటల్‌ దగ్గర ఆగుతారు. ఆ హోటల్‌లో సాగర్‌ ఓ న్యూస్‌ పేపర్‌ కటింగ్‌ను చూస్తాడు. అందులో సాగర్‌ కుక్క ‘ఎ’ రోడ్డు ప్రమాదంలో చనిపోతుందని ఉంటుంది. కొద్దిసేపటికే సాగర్‌ కారును లారీ ఢీకొట్టడంతో అందులో ఉన్న శునకం చనిపోతుంది. అప్పటి నుంచి సాగర్‌ ఫ్యామిలీలో ఏదో ఒక విషాదం జరుగుతూనే ఉంటుంది. చివరికి అతడి కుమార్తె అంజలి కూడా చనిపోతుంది. సాగర్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతడిని కలిసి వారు ఏదో ఒక కారణంతో చనిపోతూ ఉంటారు. వారు ఎలా చనిపోబోతున్నారో ముందే తెలియజేస్తూ ఓ పాత న్యూస్‌పేపర్‌ ఆర్టికల్‌ క్లిప్పింగ్‌ సాగర్‌కు ఎదురవుతూ ఉంటుంది. (Dhootha review in telugu) ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్‌ అయిన సాగర్‌ జీవితం ఎలా మలుపులు తిరిగింది? కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సాగర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఈ హత్యలకు స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాజ్యం వచ్చిన తర్వాత ‘దూత’ పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ కేసులను డీసీపీ క్రాంతి షినోయ్‌ (పార్వతి తిరువత్తు) ఎలా ఛేదించింది. తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే..

దర్శకుడిగా విక్రమ్‌ కె కుమార్‌ది విభిన్నమైన శైలి. ఆయన ఎంచుకునే ప్రతి కథా కాస్త భిన్నంగా ఉంటుంది. ‘13బి’ నుంచి ‘మనం’ వరకూ విక్రమ్ కె కుమార్ సినిమాలు చూస్తే... కథలో ఆసక్తికర ఎలిమెంట్‌ ఉంటుంది. అది విధి లేదా కనిపించని ఏదో ఒక శక్తి కూడా అవ్వొచ్చు. అదే కథ, అందులోని పాత్రలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీంతో సంక్లిష్టమైన కథ, కథనాలు కూడా ప్రేక్షకులకు చాలా సులభంగా అర్థమవుతాయి. అంతేకాదు, ప్రేక్షకుడి దానికి బాగా కనెక్ట్‌ అవుతాడు. (Dhootha review in telugu) అలా ‘దూత’ను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దడంలో విక్రమ్‌ కె కుమార్‌ నూటికి నూరు పాళ్లు విజయం సాధించారు. సమాచార్‌ పత్రిక ఎడిటర్‌గా సాగర్‌ బాధ్యతలు స్వీకరిస్తున్న సన్నివేశంతో కథను ప్రారంభించిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. సాగర్‌ కారుకు యాక్సిడెంట్‌ అయి, అందులోని కుక్క చనిపోతుందని పేపర్‌ క్లిప్‌ కనిపించడంతో మొదలైన కథ చివరి వరకూ పరుగులు పెడుతూనే ఉంటుంది.

కొత్త పాత్రలు వస్తూ ఉంటాయి. కొన్ని పాత్రలు చనిపోతూ ఉంటాయి. ఉన్న పాత్రధారులకు ఎప్పుడు ఏం జరగుతుందోనన్న ఉత్కంఠ సిరీస్‌ చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడిని తొలిచేస్తూ ఉంటుంది. అసలు తనకే ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకునేందుకు సాగర్‌ రంగంలోకి దిగడానికి కొద్ది సమయం తీసుకున్నాడు దర్శకుడు. .(Dhootha review telugu) ఐదో ఎపిసోడ్‌కు గానీ సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడికి వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై కాస్త స్పష్టత వస్తుంది. అయితే, అప్పటివరకూ జరిగే కథ ఎక్కడైనా బోరింగ్‌ అనిపిస్తుందా అంటే చాలా తక్కువ సందర్భాల్లోనేనని చెప్పాలి. మొదటి ఎపిసోడ్‌ చూసి, ‘దూత’ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ప్రేక్షకుడికి తిరిగి వెనక్కి వెళ్లాలనిపించదు.

హత్యకు గురయ్యే ప్రతి పాత్రనూ ప్రధాన పాత్రధారి అయిన సాగర్‌కు ఇంటర్‌లింక్‌ చేస్తూ రాసుకున్న కథనం ఆసక్తికరంగా ఉంది. వాళ్లు చనిపోవడానికి ప్రేరేపించే పరిస్థితులు ఏంటి? అన్న విషయాన్ని థ్రిల్లర్‌ మూవీలు చూసే ప్రేక్షకుడు కూడా గుర్తించడం కాస్త కష్టమే. వరుస హత్యలకు కారణం ఏంటో సాగర్‌ కనిపెట్టే క్రమంలో వచ్చే ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదే సమయంలో పేపర్‌ కటింగ్స్‌ రూపంలో కొన్ని మెసేజ్‌లు రావడం, అందులో ఉన్నట్లుగానే జరగడంతో ఆ ఆసక్తి మరింత రెట్టింపు అవుతుంది. .(Dhootha review telugu) కానీ, ఇక్కడే ఓ చిన్న సమస్య. దేనినైనా ఎక్కువగా లాగకూడదు. (Dhootha review in telugu) సిరీస్‌ కావడంతో విక్రమ్‌ కె కుమార్‌ ఆ ఎడ్జ్‌ను తీసుకుని, డీటెలింగ్‌ పేరుతో కొన్ని సన్నివేశాలను సాగదీశారనిపిస్తుంది. సిరీస్‌ మొదలైనప్పటి నుంచి సాగర్‌ చుట్టూ జరిగే విషయాలకు కారణం ఎవరనే విషయాన్ని దాచిపెడుతూ ప్రేక్షకుడి దృష్టిని చాలా పాత్రలపై మళ్లించారు. రిపోర్టర్‌ కిరణ్‌ పాత్ర వచ్చాకే ఒక్కో విషయం బయట పడుతూ వస్తుంది. అప్పటి వరకూ ప్రేక్షకుడిని కథకు బాగా ఎంగేజ్‌ చేశారు. అయితే, కిరణ్‌ పాత్ర వచ్చిన తర్వాత ‘దూత’ హారర్‌ టర్న్‌ తీసుకుంటుంది.

ప్రేక్షకుడి దృష్టిని దెయ్యం వైపు మళ్లించి, అక్కడ కూడా ఎంగేజ్‌ చేయడంలో మంచి సన్నివేశాలే పడ్డాయి. అయితే, ఒకవైపు దెయ్యం అని భావిస్తూనే మరోవైపు దెయ్యం కాకుండా ఎవరో ఇవన్నీ చేయిస్తున్నారన్న ఇంటెన్షన్‌ను కూడా క్రియేట్‌ చేశారు. అసలు ఈ హత్యలకు లింక్‌ ఆరో ఎపిసోడ్‌లో గానీ దొరకదు. అయితే ఆ గుట్టు కూడా పూర్తిగా విప్పకుండా చివరి ఎపిసోడ్‌ వరకూ ఎంగేజ్‌ చేశారు. ఈ క్రమంలో వచ్చే ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు మళ్లీ కాస్త ల్యాగ్‌ అనిపిస్తాయి. (Dhootha review in telugu) కథలో అంతర్లీనంగా చాలా సినిమాలు స్ఫురణకు వస్తాయి. ‘ఫిల్మ్‌ బై అరవింద్‌’, ‘దృశ్యం2’, ‘మురారి’ ఛాయలు ‘దూత’లో కనిపిస్తాయి. చివరిలో వరుస హత్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు సాగర్‌వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే ఉత్కంఠ తొలిచేస్తుంటుంది. ఆయా సన్నివేశాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చివరిలో మరో కేసు విచారణకు డీసీపీ క్రాంతి కిరణ్‌ రెడీ అవుతూ కనిపించడంతో మరో సీజన్‌ ఉంటుందని చెప్పేశారు.

ఎవరెలా చేశారంటే..

ఇప్పటివరకూ కథానాయకుడు నాగచైతన్య పలు జానర్లు ప్రయత్నించారు. లవర్‌ బాయ్‌ దగ్గరి నుంచి మాస్ హీరో వరకూ చాలా పాత్రలు చేశారు. వాటన్నింటికీ భిన్నంగా ‘దూత’లో సాగర్‌వర్మ పాత్రలో కనిపించారు. గ్రేషేడ్స్‌ ఉంటాయి. వాటన్నింటినీ కన్విన్సింగ్‌ చేస్తూ, సెటల్డ్‌ నటించారు. ఎక్కడా అతి కనపడదు. వెబ్‌సిరీస్‌ కావడంతో ‘ఎఫ్‌’ పదాలు అలా నోటి నుంచి దొర్లిపోతుంటాయి. చాలా పాత్రలకు అసభ్య పదజాలం వచ్చేస్తుంటుంది. (Dhootha review in telugu) డీసీపీ క్రాంతిగా పార్వతి తిరువత్తు, సాగర్‌ భార్యగా ప్రియా భవానీ శంకర్‌, పీఏగా ప్రాచీ దేశాయ్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎస్సై అజయ్‌ ఘోష్‌ పాత్రలో రవీంద్ర విజయ్‌ క్యారెక్టర్‌ కాస్త డిఫరెంట్‌ డిక్షన్‌ ట్రై చేశారు. ప్రతి పాత్రను సాగర్‌పాత్రకు ఇంటర్‌లింక్‌ చేయడంతో ఏ పాత్రనూ మర్చిపోలేం. తనికెళ్ల భరణి, పశుపతి, రాజా విజయ్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితర పాత్రలు తళుక్కున మెరుస్తాయి.

సాంకేతికంగా ఎలా ఉంది?

 • సంగీతం: ఇషాన్‌ చాబ్రా నేపథ్య సంగీతం పాత్రలను, సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ‘దూత’ థీమ్‌ కూడా సిరీస్‌ చూస్తున్నంతసేపూ వెంటాడుతూ ఉంటుంది. వెంకటేష్‌ దొండపాటి సంభాషణలు బాగానే ఉన్నాయి. ‘పవర్‌లో ఉన్న వారిపై మనం పవర్‌ కలిగి ఉండటం మనకు ముఖ్యం కదా’, ‘మనం ఎన్ని పేజీలు రాశామన్నది కాదు. ఎన్ని నిజాలు బయట పెట్టామన్నదే జర్నలిజం’ వంటి సంభాషణలు బాగున్నాయి. .(Dhootha review telugu) రచయితలు వెబ్‌సిరీసుల్లో అసభ్యపదజాలం తగ్గిస్తే ఇంటిల్లీపాదీ చూసే అవకాశం ఉంటుంది.
 • సినిమాటోగ్రఫీ: ఈ సిరీస్‌కు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మికోలజ్‌ సైగులా సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ‘దూత’ మొత్తం వర్షంలోనే సాగుతుంది. అందుకు కారణాన్ని కూడా మొదటి ఎపిసోడ్‌లోనే చెప్పేస్తారు. తీవ్ర వాయుగుండం కారణంగా ఆరు రోజుల పాటు వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణశాఖ ప్రకటన టీవీలో కనిపిస్తుంది. సాధారణంగా ఒకట్రెండు సన్నివేశాలకు మించి వర్షంలో చిత్రీకరణ చేయడం కొంచెం కష్టం. నటీనటులు, కాస్ట్యూమ్స్‌ అన్నీ తడిచిపోతూ ఉంటాయి. ఏ పాత్ర వర్షంలో తడిచింది? ఏ పాత్ర తడవలేదు? అని గుర్తు పెట్టుకోవడం కూడా కాస్త కష్టమే. కానీ, సన్నివేశానికి తగినట్లు ప్రతిదీ డీటెలింగ్‌ ఉండేలా చూసుకున్నారు.
 • ఎడిటింగ్‌: నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఓకే. దర్శకుడు విజన్‌కు గౌరవం ఇచ్చి, నిడివి వదిలేశారేమో అనిపిస్తుంది. .(Dhootha review telugu)మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌ ఒక్కోటి సుమారు 40 నిమిషాలకు పైనే ఉంటుంది. సిరీస్‌ మొత్తం 5 గంటలా 46 నిమిషాలు.
 • ప్రొడక్షన్‌: నిర్మాణ పరంగా సిరీస్‌ విషయంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా రాజీ పడలేదు. కథకు, పాత్రకు కావాల్సిన నటీనటులు, టెక్నికల్‌ అంశాలు అన్నింటినీ సమకూర్చారు. సిరీస్‌ కోసం పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. వీఎఫ్‌ఎక్స్‌ సీన్స్‌ ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగుండేది.
 • దర్శకత్వం: చివరిగా దర్శకుడు, రచయిత విక్రమ్‌ కె కుమార్‌ గురించి చెప్పాల్సి వస్తే.. ‘దూత’ను ఒక సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తీయడమే కాదు.. అంతర్లీనంగా ఓ సందేశాన్ని కూడా ఇచ్చారు. మీడియాలో అవినీతిని ఎత్తి చూపుతూనే, రాజకీయ నాయకులు తమ అవసరాలకు మీడియాను ఎలా వాడుకుంటున్నారన్న విషయాన్ని టచ్‌ చేశారు. ఒకరకంగా ప్రస్తుతం సమాజంలో ఉన్న పత్రికలు, ఛానళ్లపై విక్రమ్‌ వ్యంగ్య బాణం. రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, మీడియా రంగాల్లో ఉన్న మంచి, చెడులను చూపించారు. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త పాత్రలు వస్తున్నా, తాను అనుకున్న పాయింట్‌ నుంచి అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ వెళ్లకుండా తీశారు. అదే స్క్రీన్‌పై చూపించారు. చివరిలో మరో సీజన్‌ అంటూ ఆసక్తిని పెంచారు.

ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?

చూడొచ్చు. కానీ, పైన చెప్పినట్లు అసభ్యపదజాలం కాస్త ఇబ్బంది పెడుతుంది..(Dhootha review telugu) ఒకట్రెండు ఇంటిమసీ సీన్స్‌ కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయో కాస్త ముందే తెలుస్తుంది. అక్కడ ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే హత్యలు కూడా దారుణంగా ఉంటాయి. ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. చిన్న పిల్లలతో కలిసి చూడకుండా ఉంటే బెటర్‌.

 • బలాలు
 • + కథ, కథనాలు
 • + నాగచైతన్య, ఇతర నటులు
 • + దర్శకత్వం, సాంకేతిక బృందం పనితీరు
 • బలహీనతలు
 • - అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు
 • - నిడివి
 • చివరిగా: థ్రిల్లింగ్‌ ‘దూత’..(Dhootha review telugu)
 • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు