Extraction 2 review: రివ్యూ: ఎక్స్‌ట్రాక్షన్‌ 2

Extraction 2 review: క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రలో నటించిన ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ ఎలా ఉందంటే?

Updated : 17 Jun 2023 16:20 IST

Extraction 2 review; చిత్రం: ఎక్స్‌ట్రాక్షన్ 2; నటీనటులు: క్రిస్ హెమ్స్‌వర్త్, ఓల్గా కుర్లింకో, గోల్ షిఫ్టె ఫర్హానీ, ఆడం బెస్సా, డేనియల్‌ బెర్నాడ్డ్‌, ఇద్రిస్‌ ఎల్బా తదితరులు; సినిమాటోగ్రఫీ: గ్రెగ్ బాల్డీ; సంగీతం: హెన్రీ జాక్‌మన్, అలెక్స్ బెల్చర్; నిర్మాతలు: రుస్సో బ్రదర్స్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ తదితరులు రచన: జో రుస్సో; దర్శకత్వం: సామ్ హార్‌గ్రీవ్; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

హాలీవుడ్‌ చిత్రాలు యాక్షన్‌ ప్రియులకు విందు భోజనం పెడతాయి. కథానాయకుడు విలన్‌ గ్యాంగ్‌ తుక్కు రేగ్గొడుతూ ఉంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి వచ్చే మజానే వేరు. అలా 2020లో వచ్చిన యాక్షన్‌ మూవీ ‘ఎక్స్‌ట్రాక్షన్’. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమా మంచి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు వచ్చిన తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’. మరి ఈ సినిమా ఎలా ఉంది?(Extraction 2 review in telugu) క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ఇందులో చేపట్టిన మిషన్‌ ఏంటి?

కథేంటంటే: ఫస్ట్‌పార్ట్‌ ‘ఎక్స్‌ట్రాక్షన్‌’లో విలన్‌ గ్యాంగ్‌తో పోరాడి తీవ్రంగా గాయపడతాడు టైలర్‌ రేక్‌ (క్రిస్‌ హేమ్స్‌వర్త్‌). బంగ్లాదేశ్‌లో బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన అతడు ఇండియాలోని బెంగాల్‌లో ఒక ప్రాంతానికి కొట్టుకుని వస్తాడు. దాదాపు చావు అంచుల వరకూ వెళ్లిన టైలర్‌ తిరిగి కోలుకుంటాడు. ఈ క్రమంలోనే మరో మిషన్ అతడిని వెతుక్కుంటూ వస్తుంది. జార్జియాలోని ప్రమాదకరమైన జైల్లో బందీలుగా ఉన్న కెటెవాన్ (టినాటిన్ ), ఆమె పిల్లలను కాపాడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లిన టైలర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? టైలర్‌ వారిని కాపాడగలిగాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: యాక్షన్‌ సినిమాలకు కథతో పెద్దగా పనిలేదు. ఒక చిన్న పాయింట్‌ చాలు. దాన్ని పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్‌ సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లడమే. అయితే, వాటిని ఎంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారన్న దానిపైనే ఆ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. సినిమాలో అన్నిసార్లు కథానాయకుడికి అనుకూలంగా ఉంటే, అందులో భావోద్వేగాలు పెద్దగా రక్తికట్టవు. కథానాయకుడికి విషమ పరిస్థితి ఎదురవ్వాలి. శత్రుమూకలు అతడిని, అతడు ఎంచుకున్న లక్ష్యాన్ని దెబ్బతీసేలా సన్నివేశాలను రాసుకోవాలి. వాటి నుంచి ధీరోదాత్తుడైన మన కథానాయకుడు ఎలా బయటపడ్డాడన్న దాన్ని భావోద్వేగభరితంగా చూపిస్తూ కథనం ముందుకు తీసుకెళ్తుంటే అప్పుడు ప్రేక్షకుడు కథలో లీనమై సినిమాను ఆస్వాదించగలుగుతాడు. ‘ఎక్స్‌ట్రాక్షన్‌’ వంటి యాక్షన్‌ చిత్రాల్లో జరిగేది ఇదే. తొలి భాగాన్ని ఏవిధంగానైతే యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశారో సీక్వెల్‌లో కూడా అంతకుమించి యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. వాటికి కాస్త ఎమోషన్స్‌ను జోడించారు. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాగంలో యాక్షన్‌ సన్నివేశాలపై మరింత శ్రద్ధ పెట్టినట్లు కనపడుతుంది. ఇందులో టైలర్‌ వ్యక్తిగత జీవితాన్ని కూడా స్పృశిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దారు. హేమ్స్‌వర్త్‌, ఫర్హానాల మధ్య కొన్ని సన్నివేశాలు యాక్షన్‌ సన్నివేశాల మధ్య అవి కాస్త ఉపశమనం కలిగిస్తాయి.

రచయిత/దర్శకుడు కథ కన్నా కూడా యాక్షన్‌ సన్నివేశాలను నమ్ముకునే ఈ సినిమాను తీసినట్లు అర్థమవుతుంది. అందుకు ఉదాహరణ సింగిల్‌ షాట్‌ యాక్షన్‌ సీన్‌. దాదాపు రెండు గంటల పాటు సాగే కథలో 20 నిమిషాల పాటు ఒకే ఒక యాక్షన్‌ సీన్‌ ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే, దాన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం బాగుంది. ఆ సీన్‌చూస్తూ ప్రేక్షకుడు యాక్షన్‌మోడ్‌లో ఉండిపోతాడు. ఇలాంటి సీన్స్‌ థియేటర్‌లో చూస్తే వచ్చే మజానే వేరు. ఇలాంటివే మరో రెండు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాలో ఉంటాయి. కథానాయకుడు ధీరోదాత్తుడై ఉన్నప్పుడు విలన్‌ అతడికి మించిన బలవంతుడై ఉండాలి. కానీ, ఇందులో విలన్‌ పాత్రను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. హీరోగారి వీర కుమ్ముడు మీద పెట్టిన శ్రద్ధ విలన్‌ పాత్రను డిజైన్‌ చేసుకునేదానిమీద పెట్టి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటేంది. ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’లో అదే కాస్త మైనస్‌. చివరి వరకూ విలన్‌ను కూడా బలంగా చూపించి ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. చివరిలో మూడో భాగానికి కూడా బాటలు వేశారు.

ఎవరెలా చేశారంటే: అవెంజర్స్‌లో థోర్‌గా సుపరిచితుడైన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌  ఈ చిత్రంలో టైలర్‌ రేక్‌గా అదరగొట్టాడు. తొలి భాగానికి మించి యాక్షన్‌సన్నివేశాల్లో దుమ్ముదులిపేశాడు. సినిమా మొత్తం అతడి చుట్టూనే నడుస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చేసిన గ్రెగ్‌ బ్లాడీకి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. యాక్షన్‌ సీన్స్‌ను డిజైన్‌చేసిన విధానం మైండ్‌ బ్లోయింగ్‌. మరీ ముఖ్యంగా సింగిల్‌షాట్‌ యాక్షన్‌ సీన్‌. దానికి నేపథ్య సంగీతం జతచేరి, మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఎడిటింగ్‌ కూడా షార్ప్‌గా ఉంది. హాలీవుడ్‌ చిత్రాల నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్‌ సీన్స్‌ కోసం పెట్టిన ఖర్చు స్పష్టంగా కనపడుతుంది. అయితే, రచయిత జో రుస్సో, దర్శకుడు సామ్‌ హర్‌గ్రేవ్‌ యాక్షన్‌ సీన్స్‌ మీద పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పెట్టలేదు. అదే ప్రధానలోపం. కథ, కాకరకాయతో పని లేకుండా ఈ వీకెండ్‌లో ఒక మంచి యాక్షన్‌మూవీ చూడాలనుకుంటే ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ చూడొచ్చు. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + మూడు యాక్షన్‌సన్నివేశాలు
  • + క్రిస్‌ హేమ్స్‌వర్త్‌
  • + నిడివి
  • బలహీనతలు
  • - రొటీన్‌ యాక్షన్‌ డ్రామా
  • - అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు
  • చివరిగా: ఎక్స్‌ట్రాక్షన్‌.. డబుల్‌ డోస్‌ యాక్షన్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని